IPL 2024 DC VS Mumbai Indians 18,000 children : ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎన్జీవోల నుంచి 18వేల మంది పిల్లలను స్టేడియానికి తీసుకొచ్చారు నీతా అంబానీ. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌కు వీరిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చదువు, క్రీడలపై మాట్లాడిన నీతా అంబానీ వాటి ప్రాముఖ్యత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు.
"ఈ చిన్నారులు స్టేడియంలో ఉల్లాసంతో పాటు పాజిటివిటీని పెంచారు. ఎన్జీవోల నుంచి 18వేల మంది చిన్నారులు ఇక్కడికొచ్చారు. క్రీడల్లో ఎక్కడి నుంచి వచ్చారనే వివక్ష ఉండదు. టాలెంట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. భవిష్యత్‌లో వీరిలో ఎవరో ఒక గొప్ప ప్లేయర్ కావొచ్చు. ఇలాంటి అనుభవాలు, పవర్ వారి కలల్లో ధైర్యం నింపుతాయని అనుకుంటున్నా" అని నీతా అంబానీ వెల్లడించారు.
ఈ మ్యాచ్ కోసం స్టేడియంకు వచ్చిన ముంబయి మెంటార్ సచిన్ తెందుల్కర్ మాట్లాడుతూ తనకు స్టేడియంకు వెళ్లినప్పటి తొలి రోజు ఇంకా గుర్తుందని అన్నారు. నీతా అంబానీ చిన్నారులకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కలుగజేసి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం మంచి విషయమని కొనియాడారు.
"ప్లేయర్లకు కావాల్సింది ఈ పాజిటివిటీనే. ప్రతి ఏడాది ఈ ఎక్స్‌పీరియెన్స్‌నే ఇంకా బెటర్ పర్సన్‌ను చేస్తున్నాయి. నా విషయానికొస్తే, పిల్లలే కదా భవిష్యత్ అంటే. రేపు అనే రోజు బాగుండాలంటే ఇవాళ కష్టపడాలి. నీతా అంబానీ ఆధ్వర్యంలో ద రిలయన్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతం. పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యలోనూ, క్రీడల్లోనూ ఆమె ఈ పనిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం" అని తెలిపాడు సచిన్.
ఇంకా నీతా అంబానీ మాట్లాడుతూ - "గ్రౌండ్‌లో జరిగిన సంఘటనలు పిల్లలకు మంచి పాఠాలుగా మారతాయి. 14ఏళ్ల క్రితం ఈ ESAను మొదలుపెట్టాం. ఇప్పటికీ 22మిలియన్ మంది చిన్నారులను తీసుకురాగలిగాం. సచిన్ చెప్పినట్లుగా ప్రతి చిన్నారికి ఆడే హక్కు ఉంటుంది. క్లాస్ రూంలో నేర్చుకున్న దాంతో పాటుగా ప్లేగ్రౌండ్ లోనూ విషయాలను నేర్చుకోగలుగుతారు చిన్నారులు. క్రీడలనేవి విజయాలను, ఓటములను ఎలా తట్టుకోవాలో, క్రమశిక్షణ ఎలా అలవర్చుకోవాలో, కఠిన శ్రమతో ఎలా సిద్ధం కావాలో నేర్పిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నారుల కోసం ESA ఒక మార్గదర్శిలా వ్యవహరిస్తుంది." అని అంబానీ అన్నారు.