IPL 2024 DC VS CSK Dhoni : ఐపీఎల్-2024 సీజన్లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓటమిని అందుకుంది. వైజాగ్ వేదికగా జరిగిన పోరులో దిల్లీ క్యాపిటల్స్‌పై 20 పరుగుల తేడాతో ఓటమిని అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయినప్పటికీ ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్‌తో తన అభిమానులను ఉర్రూతలూగించాడు.
అసలు మహీ ఎప్పుడెప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడా అని కాచుకొని కూర్చున్న ఫ్యాన్స్‌కు ఉత్సాహం పరుగులెత్తేలా చేశాడు. చెన్నై ఆడిన తొలి రెండు మ్యాచుల్లో బరిలోకి దిగని అతడు ఇప్పుడు దిల్లీతో జరిగిన పోరులో క్రీజులోకి వచ్చి బౌండరీల వర్షం కురిపించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడమే కాదు బుల్లెట్ల లాంటి షాట్లు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్ల గుండెల్లో దడ పుట్టించాడు. అతడు సిక్సర్లు బాదుతుంటే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది.
జడేజాతో కలిసి దిల్లీ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన వెంటనే మహీ ఇచ్చిన క్యాచ్‌ను అహ్మద్ పట్టుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత ధోనీ వీర బాదుడు ఆగలేదు. అహ్మద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్‌లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 4, 6, 0, 4, 0, 6లతో 20 పరుగులు సాధించాడు. ఇందులో రెండేసి సిక్సర్లు, ఫోర్లు ఉన్నాయి. సిక్సర్‌తోనే తన ఇన్నింగ్స్ ముగించాడు.ఇక ఇదే ఓవర్‌లో మహీ కొట్టిన సింగిల్ హ్యాండ్ సిక్స్ అయితే మ్యాచ్ మొత్తానికే హైలెట్ షాట్‌గా నిలిచింది. ఇలా మహీ జోరు చూసిన ఫ్యాన్స్ అతడు ఒక ఓవర్ ముందే బ్యాటింగ్‌కు దిగి ఉంటే సీఎస్కే గెలిచేదేమో అని భావిస్తున్నారు. ప్రస్తుతం మహీ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తలా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
కాగా, మహీకి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆఖరి సారిగా అతడి మెరుపులు చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఇప్పటికైతే ఈ విధంగా నెరవేరిందనే చెప్పాలి.
వైజాగ్ మ్యాచ్ - సీఎస్కేపై దిల్లీ క్యాపిటల్స్ విజయం - IPL 2024 CSK VS DC