Sunil Chhetri Retirement: భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో జూన్ 6న కువైట్‌తో జరగనున్న క్వాలిఫైయింగ్ మ్యాచ్ అనంతరం ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ నుంచి తప్పుకోనున్నట్లు గురువారం పేర్కొన్నాడు. ఈ మేరకు 39ఏళ్ల సునీల్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా చెప్పాడు. 2005లో ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో కెరీర్ ప్రారంభించిన ఛెత్రి భారత్ తరఫున 150 మ్యాచ్‌ల్లో 95 గోల్స్ చేశాడు.
ఈ క్రమంలో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గోల్స్ చేసిన లిస్ట్‌లో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో (128 గోల్స్, 205 మ్యాచ్‌ల్లో) టాప్‌లో ఉండగా, ఇరాన్ ప్లేయర్ అలీ డే (108 గోల్స్, 148 మ్యాచ్‌ల్లో) రెండు, అర్జెంటినా స్టార్ లియోనల్ మెస్సీ (106, 180 మ్యాచ్‌ల్లో) మూడో స్థానంలో ఉన్నారు.
ఇక అంతర్జాతీయ ఈవెంట్లలో సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ టోర్నీలో భారత్‌ను రెండుసార్లు (2011, 2015) ఛెత్రి ఛాంపియన్‌గా నిలిపాడు. 2008 AFC ఛాలెంజింగ్ కప్, 2017, 2018ల్లో ఇంటర్కాంటినెంటల్ కప్‌ల్లో భారత్‌ను విజేతగా నిలిపాడు. వ్యక్తిగతంగా సునీల్ ఛెత్రి 6 సార్లు ఆల్ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) ప్లేయర్‌గా కూడా నిలిచాడు.
అర్జునా, పద్మశ్రీ: ఈ లెజెండరీ ప్లేయర్‌కు 2011లో అత్యున్నత క్రీడా పురస్కారం 'అర్జునా అవార్డు' దక్కింది. భారత్‌లో 'ఖేల్‌రత్న' తర్వాత 'అర్జున అవార్డు' రెండో అత్యున్నత క్రీడా పురస్కారంగా ఉంది. ఇక 2019లో భారత ప్రభుత్వం సునీల్ ఛెత్రిని పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
అదే ఆఖరిది: ఇక ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌లో జూన్ 6న కువైట్‌తో జరగనున్న మ్యాచ్ సునీల్ ఛెత్రికి ఇంటర్నేషనల్ కెరీర్లో ఆఖరిది కానుంది. ప్రస్తుతం ఈ టోర్నమెంట్లో A గ్రూప్‌లో ఉన్న భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కువైట్ 3 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది.
శాఫ్ సెమీల్లో ఛెత్రి సేన విక్టరీ.. ఫైనల్స్‌లో కువైట్‌తో ఢీ!
మైదానంలో దిగితే అతడి గురి గోల్పైనే.. ఛెత్రి అరుదైన రికార్డు.. ఆ స్టార్స్‌ను దాటి..