India vs Zimbabwe 2nd T20I 2024: జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో కంగుతిన్న టీమ్ఇండియా ఆదివారం రెండో మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం టీమ్ఇండియాను కాస్త దెబ్బతీసింది. ఇక అదే పిచ్‌పై యువభారత్ మరోసారి జింబాబ్వేను ఢీకొట్టనుంది. తొలి టీ20లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని, టీమ్ఇండియా కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కుర్రాళ్లు సత్తా చాటి తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది.
ఐపీఎల్లో పరుగుల వరద పారించిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ తొలి టీ20లో భారీ అంచనాలతో బరిలోకి దిగి విఫలమయ్యారు. ఆరంభంలో టపటపా వికెట్లు కోల్పోవడం వల్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్ రాణించాలి. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ జోరు కొనసాగించాలి. ఇక ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ నుంచి సహాకారం ఉంటే మరోసారి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలి.
జోరులో జింబాబ్వే: 5టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను విజయంతో ఆరంభించిన ఆతిథ్య జింబాబ్వే జోరుమీదుంది. స్ఫూర్తిదాయక ఆట తీరులో జింబాబ్వే క్రికెట్ లవర్స్‌ను ఆకర్షించింది. తొలి టీ20లో విజయం వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. సొంతగడ్డపై జోరు కొనసాగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన బ్యాటర్లు ఈసారి పక్కా ప్రణాళికతో రావచ్చు. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
తొలి టీ20 విషయానికొస్తే, ఈమ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో నెగ్గింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ గిల్ 31 టాప్ స్కోరర్. అభిషేశ్ శర్మ (0), రుతురాజ్ (7), రియాన్ (2), రింకు (0), ధ్రువ్ జురెల్ (6) చేతులెత్తేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (27) రాణించినా ఫలితం లేకపోయింది.
జింబాబ్వేతో సిరీస్ - టీమ్ఇండియా జెర్సీపై ఒకే స్టార్ ఎందుకంటే?
తొలి టీ20లో టీమ్ఇండియాకు షాక్ - జింబాబ్వే విజయం - Zimbabwe vs India