R Ashwin India Vs Bangladesh 1st Test : చెన్నై వేదికగా తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా చెలరేగిపోయింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్ స్కిల్స్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ అదరగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ టెస్ట్‌తో అశ్విన్ పలు రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటంటే?
ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్ల లిస్ట్‌లో 8వ స్థానంలో ఉన్న కోట్నీ వాల్ష్‌ను అశ్విన్ 522 వికెట్లతో వెనక్కి నెట్టేశాడు. దీంతో ఇప్పటి వరకు 519 వికెట్లతో ఉన్న కరేబియన్ బౌలర్‌ను తొమ్మిదో స్థానానికి పరిమితం చేశాడు. అయితే ఈ ఇద్దరికంటే ముందు ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563), నాథన్ లయన్ (530) మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు.
ఇదిలా ఉండగా, అశ్విన్ మరో 9 వికెట్లు తీస్తే ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్‌ను దాటేస్తాడు. కానీ అంతకంటే ముందే లయన్దే మరో రికార్డును బ్రేక్ చేశాడు అశ్విన్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా యాష్ నిలిచాడు. ఈ రికార్డును అతడు మొత్తం 11 సార్లు సాధించాడు. దీంతో ఈ లిస్ట్‌లో యాష్ తర్వాత లయన్ (10), ప్యాట్ కమిన్స్ (8), జస్ప్రీత్ బుమ్రా (7), జోష్ హేజిల్‌వుడ్ (6), టిమ్ సౌథీ (6) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Ravichandran Ashwin’s six-wicket haul leads India to an emphatic win in Chennai 🤩#WTC25 | #INDvBAN ➡️ https://t.co/akLigwiJZ7 pic.twitter.com/DPVxiLjNkW
— ICC (@ICC) September 22, 2024
టీమ్ఇండియా ఖాతాలోనూ రేర్ రికార్డు
ఇక ఇదే వేదికగా టీమ్ఇండియా కూడా తన ఖాతాలో ఓ స్పెషల్ రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు 580 టెస్టులు (బంగ్లాతో మ్యాచ్‌ను కలుపుకొని) ఆడిన భారత్, అందులో 179 విజయాలు సాధించింది. మరో 178 ఓటమి పాలవ్వగా, 222 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఒకటి మాత్రం టైగా ముగించింది. ఇలా పరాజయాల కంటే గెలుపులే అధికం కావడం కూడా జట్టుకు ఇదే తొలిసారి. అత్యధిక టెస్టు విజయాలను నమోదు చేసిన నాలుగో టీమ్‌గా భారత్ అవతరించడం విశేషం.
ఇక టెస్ట్ జర్నీలో భారత జట్టు బాధ్యతలను 36 మంది చేపట్టారు. అందులో మొదటి కెప్టెన్ సీకే నాయుడు కాగా, ప్రస్తుత కెప్టెన్ రోహిత్‌శర్మ. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కెప్టెన్లందరూ జట్టుని ముందుండి నడిపించి ఎన్నో విజయాలను మరెన్నో జ్ఞాపకాలనూ దేశానికి అందించారు. ఈ 92 ఏళ్లలో 314 మంది క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, 1932 జూన్ 25న అమర్‌సింగ్ లండన్‌లో మొదటి టోపీ అందుకున్నారు. 2024 మార్చి 7న ధర్మశాలలో దేవదత్ చివరిసారిగా టోపీ చేజిక్కించుకున్నాడు.
సూపర్ సెంచరీతో ధోనీ రికార్డ్ సమం - ఆ విషయంలో తలా కంటే అశ్విన్ ఎక్కువే! - Ashwin Test Record