India Vs Bangladesh 1st T20 : ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్ఇండియా వైట్ వాష్ చేసింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌పై కూడా కన్నేసింది. అక్టోబరు 6న గ్వాలియర్ నగరంలో కొత్తగా నిర్మించిన 'శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం'లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. అయితే 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ నగరంలో ఇంటర్నేషల్ క్రికెట్ మ్యాచ్ జరగనుండటం గమనార్హం.
సచిన్ డబుల్ సెంచరీ తర్వాత నో మ్యాచ్
గ్వాలియర్ నగరంలో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. ఇక్కడ చివరి మ్యాచ్ 2010లో జరిగింది. రూప్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్లో మొదటి డబుల్ సెంచరీని చేశాడు. దీంతో టీమ్ఇండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే గ్వాలియర్ లో సుదీర్ఘకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుండటం వల్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ మార్పుతో గ్వాలియర్‌కు అవకాశం
అయితే తొలుత భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20ని హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. అక్కడ స్టేడియం పునరుద్ధరణ పనులు జరుగుతుండడం వల్ల వేదికను ఇటీవలే మార్చింది. గ్వాలియర్ లోని 'శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం'లో నిర్వహించేందుకు సిద్ధమైంది. దీంతో 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది.
గ్వాలియర్‌లో 10 వన్డేలు ఆడిన భారత్
గ్వాలియర్ నగరంలోని రూప్ సింగ్ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1988లో జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్వాలియర్ లో ఇప్పటివరకు టీమ్ ఇండియా మొత్తం 10 వన్డేలు ఆడగా, అందులో 8 గెలిచింది. రెండింట్లో ఓటమిపాలైంది.
గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లు :
1988 - భారత్‌పై 73 పరుగుల తేడాతో విండీస్ విజయం
1989 - ఇంగ్లాండ్‌పై 26 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలుపు
1991 - దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో భారత్ గెలుపు
1993 - 3 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం
1993 - ఇంగ్లాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపు
1996 - విండీస్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం
1997 - శ్రీలంకపై పాకిస్థాన్ 30 పరుగుల తేడాతో గెలుపు
1998 - భారత్‌పై 69 పరుగుల తేడాతో కెన్యా సంచలన విజయం
1999 - న్యూజిలాండ్ పై 14 పరుగుల తేడాతో భారత్ గెలుపు
2003 - ఆస్ట్రేలియాపై 37 పరుగుల భారత్ విజయం
2007 - పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా విజయం
2010 - సౌతాఫ్రికాపై భారత్ 153 పరుగుల తేడాతో భారీ గెలుపు
బంగ్లాతో తొలి టీ20 తుది జట్టు - తెలుగు కుర్రాడికి నో ఛాన్స్! - IND VS BAN First T20