India Champions Trophy 2025: పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇప్పటి నుంచే సన్నద్ధవుతోంది. ఈ మెగా టోర్నీ కప్పును ఈసారి ఎలాగైనా ఒడిసిపట్టాలని ప్రణాళికలను రచిస్తోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో నెగ్గాలంటే భారత జట్టులో అనేక వ్యూహాత్మక, నిర్మాణాత్మక మార్పులు చేపట్టాల్సి ఉంటుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పటిష్ఠమైన బౌలింగ్ విభాగం
వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు బౌలింగ్ మరింత మెరుగుపడాలి. యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ రూపంలో బలమైన పేసర్లు టీమ్ఇండియాలో ఉన్నారు. అయినప్పటికీ పటిష్ఠమైన స్పిన్నర్లు కూడా జట్టు విజయానికి అవసరమే. కుల్దీప్ యాదవ్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, ఇతర స్పిన్నర్లను బరిలోకి దించి ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టొచ్చు. ఇలా బలమైన పేస్‌తో పాటు స్పిన్ విభాగం కూడా ఉంటే టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆశించినమేర రాణించవచ్చు.
మిడిలార్డర్ కూడా కీలకం
ఏ జట్టుకైనా బ్యాటింగ్ లో మిడిలార్డర్ చాలా కీలకం. అయితే టీమ్ఇండియా మిడిలార్డర్ ఇటీవల కాలంలో అంతగా రాణించలేకపోతోంది. కాస్త బలహీనంగానే ఉందని చెప్పాలి. అందుకే అవసరమైనప్పుడు ఎడాపెడా బౌండరీలు బాది స్ట్రైక్ రొటేట్ చేయగల మిడిలార్డర్లు జట్టుకు అవసరం. శ్రేయస్ అయ్యర్, అజింక్యా రహానే వంటి ఆటగాళ్లు మిడిలార్డర్లో రాణించగలరు. చక్కటి భాగస్వామ్యం నిర్మించగలరు. అప్పుడు టాప్ ఆర్డర్ స్వేచ్ఛగా ఆడగలదు. మంచి ఫినిషర్‌ను కూడా జట్టులో భారత్ ఉంచుకోవాలి.
కోచ్, కెప్టెన్సీ కూడా కీలకమే
ప్రస్తుత కాలంలో కోచ్, కెప్టెన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే కెప్టెన్ రచించే వ్యూహాలు ప్రత్యర్థులను వెనక్కినెడతాయి. అందుకే కెప్టెన్‌గా ఎవరున్నా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్లాన్లు అమలు చేయాలి. కోచింగ్ సిబ్బంది కూడా ప్రత్యర్థి బలాలు, బలహీనతలపై దృష్టి సారించి జట్టుకు అండగా నిలవాలి.
తుది జట్టు కూర్పులో జాగ్రత్తలు
పాకిస్థాన్ లేదా ఇతర దేశాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగితే అక్కడ మంచి రికార్డులు ఉన్న ప్లేయర్లకు తుది జట్టులో చోటు కల్పించాలి. ఎందుకంటే సాధారణ గణాంకాలు కాకుండా ఇలా జట్టు కూర్పు చేయడం వల్ల జట్టు విజయావకాశాలు మెరుగవుతాయి.
మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే!
ఆటగాళ్లకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసికంగానూ అంతే బలంగా ఉండాలి. అప్పుడు వాళ్లు ఆటలో రాణించగలుగుతారు. పాకిస్థాన్ వంటి దేశంలో ఆడినప్పుడు భారత జట్టుపై కాస్త ఒత్తిడి ఉంటుంది. అందుకే ప్లేయర్లకు ప్రీ-టోర్నమెంట్ క్యాంప్స్, క్రీడా సైకాలజిస్టులతో మాట్లాడించాలి. అప్పుడే ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు.
టీమ్ఇండియా మా దేశం రాకూడదు- ఆటగాళ్ల భద్రతే ముఖ్యం: పాకిస్థాన్ మాజీ ప్లేయర్! - Champions Trophy 2025