Ind Vs Ban U 19 World Cup : అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. శనివారం గ్రూపు-ఎలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే - తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులను స్కోర్ చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ సహరన్ (64) తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించారు. ప్రియాన్షు మోలియా (23), వికెట్ కీపర్ అరవెల్లి అవనీష్ (23), సచిన్ దాస్ (26) కూడా జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇక బంగ్లా బౌలర్లలో మరుఫ్ (5/43) ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఎండీ రిజ్వాన్, మహఫుజుర్ రెహమాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక 252 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు ఎంతో శ్రమించినప్పటికీ 169 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ షిహాబ్ జేమ్స్ (54), అరిఫుల్ ఇస్లాం (41) మాత్రమే రాణించగలిగారు. ఓపెనర్లు అషికర్ రెహమాన్ (14), జిషాన్ ఆలం (14) పరుగులు చేయగా, ఎండీ రిజ్వాన్ (0) మాత్రం డకౌటై పెవిలియన్ బాట పట్టాడు. అహ్రార్ అమీన్ (5), కెప్టెన్ మహఫుజుర్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో సౌమీ పాండే (4/24) అదరగొట్టాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ, అర్షిన్ కులకర్ణి, ప్రియాన్షులకు తలో వికెట్ దక్కింది.
మరోవైపు వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచుల్లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు గెలిచాయి. ఈస్ట్ లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ (106) సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని బరిలోకి దిగిన అఫ్గాన్ 103 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్కు మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట స్కాట్లాండ్ 49.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు 26.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.