Siraj Harsh Treatment in Gabba : ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య ప్రారంభమైన మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వరుణిడి కారణంగా రెండో సెషన్ ఆట ఇంకా మొదలు కాలేదు. అయితే మొదటి సెషన్‌లోనూ కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగగా, సిరాజ్ 4 ఓవర్లు మాత్రమే వేశాడు. ఈ క్రమంలోనే మరోసారి అతడు ప్రేక్షకుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడు.
సిరాజ్ బౌలింగ్‌కు వచ్చిన ప్రతిసారీ వీక్షకులు పెద్దగా అరుస్తూ గోల చేశారు. అయితే దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా వీక్షకులు ఇకనైనా ద్వంద్వవైఖరి ఆపాలని, హిపోక్రసీకి ముగింపు పలకాలని ఘాటుగా అన్నాడు.
కాగా, ట్రావిస్ హెడ్ విషయంలో సిరాజ్ ప్రవర్తనను గావస్కర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. అయితే అడిలైడ్ నుంచి బ్రిస్బేన్‌కు వేదిక మారినా, ఇక్కడి ప్రేక్షకుల తీరు మాత్రం అలాగే కొనసాగడంపై గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"రెండో టెస్టులో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ మంచిగా చేశాడు. కానీ, మైదానంలోని బౌలర్‌కు అది నచ్చకపోవచ్చు. అందులో సిరాజ్ స్పందించిన తీరు కూడా వింతేమీ కాదు. సిక్స్ బాదిన తర్వాత వికెట్ దక్కితే ఆ ఆనందం మరో స్థాయిలో ఉంటుంది. కానీ, స్థానిక హీరోతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పాను. వీరిద్దరూ ఐసీసీ ఆగ్రహానికి గురి అయ్యారు. సాధారణంగానే ఫాస్ట్ బౌలర్లు అంటే మైదానంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు నియంత్రణ సాధించడం కాస్త కష్టమనే చెప్పాలి. అయితే అభిమానులు కూడా అతడిని హేళన చేయడం ప్రారంభించారు. తమ లోకల్ హీరోను అలా అనడంతో వారు రెచ్చిపోయి అలా చేశారు. కానీ, బ్రిస్బేన్‌లో వచ్చేసరికి మొదటి ఓవర్ నుంచే సిరాజ్‌ను ఆట పట్టించడం, హేళన చేయడం ప్రారంభించారు. ఇలాగే వేరే వాళ్లను తమ అభిమాన ప్లేయర్లు చేస్తే ప్రేక్షకుల్లో కొందరు సంతోషపడతారు. యాషెస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఇలాంటి సెండాఫ్ ఇస్తే అద్భుతమంటూ కొనియాడతారు. మీడియా ద్వారా ఆస్ట్రేలియా ప్రేక్షకులకు ఓ సూచన చేస్తున్నాను. ఇకనైనా అలాంటి కపటత్వంతో కూడిన ప్రవర్తనను మార్చుకోండి" అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో దిగొచ్చిన పాక్ - హైబ్రిడ్ మోడల్‌కు ఐసీసీ ఆమోదం