ICC New Chairman Jay Shah Global Cricket Journey : క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు కేవలం 35 సంవత్సరాల వయస్సులో ఐసీసీ (ICC) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పదవి పొందిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. జిల్లా స్థాయి నుంచి గ్లోబల్ క్రికెట్ బాడీకి నాయకత్వం వహించే వరకు ఆయన ప్రయాణం ఎనలేని అంకితభావం, కృషిని తెలియజేస్తుంది.
- ప్రయాణం మొదలైంది అక్కడే?
జై షా 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్ (CBCA)తో క్రికెట్ అడ్మినిస్ట్రేషన్‌లో తన కెరీర్ ప్రారంభించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA)తో రాష్ట్ర స్థాయికి ఎదిగారు. 2013లో GCA జాయింట్ సెక్రటరీ అయ్యారు. తన పదవీ కాలంలో, యువ ఆటగాళ్లకు బలమైన కోచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో షా కీలక పాత్ర పోషించారు. దీంతో 2016-17 సీజన్‌లో గుజరాత్ రంజీ ట్రోఫీ గెలుచుకుంది. - ఆటగాళ్లతో బలమైన సంబంధాలు
షా ఆటగాళ్లతో మంచి రిలేషన్స్ ఏర్పరచుకునేవారు. ఇది ఆయన కెరీర్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తన కన్నా ముందు పదవిలో ఉన్న వారిలా కాకుండా షా - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి టాప్ ప్లేయర్‌లతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ప్లేయర్స్ చెప్పింది వినడం, సపోర్ట్ చేయడంతో వాళ్లలో విశ్వాసం, గౌరవం సంపాదించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌లో భారత్ టీ20 ప్రపంచకప్ విజయం సాధించడం వెనక ఉన్న 'త్రీ పిల్లర్స్'లో షా ఒకరని రోహిత్ శర్మ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. - సవాళ్లను అధిగమించడం
కోవిడ్-19 ప్రపంచ క్రీడలకు అంతరాయం కలిగించిన 2020, 2021 సంవత్సరాల్లో జై షా నాయకత్వానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం బయో-బబుల్స్ క్రియేట్ చేశారు. టోర్నమెంట్ సురక్షితంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. అలా షా క్రైసిస్‌లోనూ తన మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో పరిస్థితిని అద్భుతంగా మేనేజ్ చేశారు. - మహిళల క్రికెట్‌కు ప్రోత్సాహం
షా అద్భుతమైన విజయాల్లో ఒకటి మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడం. షా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)ను విజయవంతంగా ప్రారంభించారు. రెండు విజయవంతమైన సీజన్‌లు నిర్వహించారు. WPL ఇప్పుడు మహిళా క్రికెటర్లకు పెద్ద మొత్తంలో శాలరీలు అందజేస్తోంది. క్రికెట్‌లో కొత్త స్టాండర్డ్స్ నెలకొల్పింది. షా భారత మహిళల క్రికెట్ జట్టుకు మెన్స్ టీమ్‌తో సమాన మ్యాచ్ ఫీజులను కూడా ప్రవేశపెట్టారు. తద్వారా క్రీడలో లింగ సమానత్వాన్ని తీసుకొచ్చారు. - టెస్ట్ క్రికెట్‌ను పరిరక్షించడం
ట్రెడిషినల్ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్‌ను సంరక్షించడానికి కూడా షా కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో, టీమ్ ఇండియా ఈ ఏడాది 10 టెస్ట్ సిరీస్‌లు ఆడుతోంది. ఈ ఫార్మాట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు కూడా అందించేలా నిర్ణయం తీసుకున్నారు. - ఐసీసీలో సవాళ్లు
కొత్త ICC ఛైర్మన్‌గా షా అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు. పాకిస్థాన్‌లో జరగబోతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పర్యవేక్షించడం మొదటి సవాలు. భారత్, పాక్ గడ్డపై అడుగు పెట్టడంలో సమస్యలు తలెత్తవచ్చు. అంతకుముందు 2023 ఆసియా కప్‌లో ఇలాంటి సవాలే ఎదురైతే, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించారు. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా మ్యాచ్‌లు నిర్వహించాయి. ఈ అంశంలో షా కు అనుభవం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అదే విధానాన్ని షా అమలు చేసే అవకాశం ఉంది. - భవిష్యత్తు లక్ష్యాలు
టెస్ట్ క్రికెట్ భవిష్యత్తును రక్షించడం, వన్ డే ఇంటర్నేషనల్స్ (ODI) ఔచిత్యాన్ని కొనసాగించడం, T20 లీగ్‌ల వృద్ధిని మేనేజ్ చేయడం షా లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే ప్రయత్నాల్లోనూ ఉన్నారు. ఒలింపిక్స్‌లో భాగమైతే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఎదుగుతుందని, కొత్త అభిమానులను ఆకర్షిస్తుందని షా అభిప్రాయపడ్డారు.
ICC ఛైర్మన్‌గా జై షా- ఏకగ్రీవంగా ఎన్నిక - Jay Shah ICC Chairman
కోహ్లీ లగ్జరీ వాచ్ కలెక్షన్స్ - వామ్మో దాని ధర ఏకంగా రూ.4.6 కోట్లు! - Kohli Expensive Watches