Hardik Pandya Son Birthday : టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య- నటాషా స్టాంకోవిచ్ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తమ 4ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు హార్దిక్ వెల్లడించాడు. ఇది తనకు కఠినమైన సమయం అని చెప్పుకొచ్చిన హార్దిక్, అభిమానుల మద్దతు తనపై ఉండాలని కోరాడు. అయితే కుమారుడు అగస్త్య బాధ్యతను తల్లిదండ్రులుగా నటాషా, తానూ ఇద్దరం చూసుకుంటామని వెల్లడించాడు. అయితే ఆగస్త్య పుట్టినరోజు(జులై 30) సందర్భంగా హార్దిక్ ఓ స్పెషల్ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
హార్దిక్ పాండ్య- నటాషా స్టాంకోవిచ్ విడిపోయిన తర్వాత అగస్త్య మొదటి బర్త్ డేను జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో కుమారుడితో కలిసి ఉన్న స్పెషల్ వీడియోను పాండ్య షేర్ చేశాడు. ఇందులో అగస్త్యను పాండ్య ముద్దాడుతూ కనిపించాడు. తండ్రికొడుకులు సరదాగా గడిపినట్లు ఆ వీడియోలో ఉంది. ఇక అగస్త్యను చూసిన హార్దిక్ ఫ్యాన్స్ జూనియర్ పాండ్య అని పోస్టులు పెడుతున్నారు. అలాగే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
"నా క్రైమ్ పార్ట్‌నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనస్పూర్తిగా ఆగును ప్రేమిస్తున్నాను." అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో హార్దిక్ రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోను చూసిన పాండ్య ఫ్యాన్స్ అతడికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇటీవలే నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకొని ముంబయి నుంచి సెర్బియాకు వెళ్లింది. ప్రస్తుతం అగస్త్య తన తల్లితో కలిసి అక్కడే ఉంటున్నాడు.
ప్రేమ వివాహం- నాలుగేళ్ల బంధానికి గుడ్ బై
2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో పాండ్య, సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాడు. తర్వాత వీరిద్దికి నిశ్చితార్థం జరిగింది. కొన్నాళ్ల తర్వాత హార్దిక్- నటాషా ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020లో లాక్ డౌన్‌లో తన భార్య గర్భిణి అని హార్దిక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే అప్పటికే వాళ్లకు పెళ్లైపోయింది. ఇక అదే ఏడాది జులై 30న నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ, గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్ పద్ధతుల్లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు.
హార్దిక్, నటాషా డివోర్స్ - క్లారిటీ ఇచ్చిన పాండ్య - Hardik Pandya Natasha Divorce