Hardik Pandya CSK Bowler Gurjapneet Singh : ఆరేళ్ల తర్వాత మళ్లీ దేశవాళ్లీ క్రికెట్లో ఆడుతోన్న టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. తన ప్రదర్శనతో బరోడా జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు.
గ్రూప్-బీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ చెలరేగి ఆడాడు. 30 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. హార్దిక్ ఇన్నింగ్స్‌తో 222 పరుగుల లక్ష్యాన్ని బరోడా చివరి బంతికి ఛేదించింది.
అయితే ఛేదనలో గుర్జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో హార్దిక్ ఏకంగా 30 పరుగులు చేశాడు. 17వ ఓవర్ వేసిన గుర్జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో హార్దిక్, తొలి మూడు బంతుల్ని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత నోబాల్ వేయగా, మళ్లీ మరో సిక్సర్, బౌండరీ బాదాడు హార్దిక్. ఆఖర్లో సింగిల్ తీసి 17వ ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. అయితే ఆ వెంటనే 20వ ఓవర్‌లో విజయ్ శంకర్ వేసిన తొలి బంతికి హార్దిక్ ఔట్ అయ్యాడు.
రూ.2.2 కోట్లకు కొనుగోలు - రీసెంట్గా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎడమచేతి వాటం బౌలర్ గుర్జప్‌నీత్ సింగ్‌ను సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ.2.2 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. గతంలో సీఎస్కే నెట్ బౌలర్‌గా ఉన్న గుర్జప్‌నీత్ కోసం వేలంలో గుజరాత్ టైటాన్స్ కూడా తీవ్రంగానే పోటీపడింది. కానీ చెన్నై జట్టు భారీ ధరతో ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను దక్కించుకుంది. అయితే ఇప్పుడు హార్దిక్ అతడి బౌలింగ్‌లోనే చెలరేగడంతో, సీఎస్కే నయా బౌలర్‌కు హార్దిక్ చుక్కులు చూపించాడంటూ కామెంట్లు వస్తున్నాయి.
Gurjapneet Singh is ready to make his mark in the IPL with his fiery bowling at the Anbuden! 🔥#TataIPL #TataIPLAuction #TNCA #TNcricket #TamilNaduCricket #TNPL #NammaOoruNammaGethu pic.twitter.com/C1FfvCnPjX
— TNCA (@TNCACricket) November 25, 2024
ఇకపోతే ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 221 పరుగులు చేసింది. జగదీషన్ (57; 32 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), విజయ్ శంకర్ (42 నాటౌట్; 22 బంతుల్లో, 6 సిక్సర్లు), కెప్టెన్ షారుక్ ఖాన్ (39; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) స్కోర్లు చేశారు. బరోడా బౌలర్లలో మెరీవాలా (3/41) మూడు, కృనాల్ పాండ్య (1/26), నినాద్ (1/32), మహేష్ (1/10) తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్య ఛేదనలో బరోడా 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భాను పనియా (42; 20 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మంచి ప్రదర్శన చేశాడు. తమిళనాడు బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/43) మూడు, సాయి కిశోర్ (2/23) రెండు వికెట్లు దక్కించుకున్నారు.
కాగా, బరోడా జట్టుకు హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య కెప్టెన్సీ వహిస్తున్నాడు. బరోడు జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడి గెలిచింది. ఈ మ్యాచుల్లో హార్దిక్ వరుసగా 74*, 41*,69 పరుగులు చేశాడు. మూడు మ్యాచుల్లోనూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో బరోడా టాప్ ప్లేస్‌లో ఉంది. తమ నెక్ట్స్ మ్యాచ్‌ను నవంబర్ 29న త్రిపురతో ఆడనుంది బరోడా.
అంతర్జాతీయ క్రికెట్‌కు హార్దిక్ రిటర్న్ ఎప్పుడంటే?
హార్దిక్ మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వచ్చే ఏడాది 2025 జనవరిలో వస్తాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. జనవరి - ఫిబ్రవరి మధ్య జరిగే ఈ పర్యటనలో భారత్ ఇంగ్లాండ్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
అప్పుడు సచిన్, కాంబ్లీ - ఇప్పుడు యశస్వి, పృథ్వీ షా!
ఐపీఎల్ 2025 - ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులైన యంగ్ ప్లేయర్స్ వీరే