ENG vs AUS Fourth ODI Poor Records : లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 186 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. అయితే ఈ పోరులో ఆసీస్ ఖాతాలో పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి.
వన్డేల్లో ఆస్ట్రేలియా భారీ పరుగుల తేడాతో పరాజయం పొందడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. ప్రస్తుతం జరిగిన మ్యాచులో 186 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలోనే 2018లో 242 పరుగులు తేడాతో ఓడిపోగా, 1986లో న్యూజిలాండ్‌పై 206 పరుగులు, 2006లో దక్షిణాఫ్రికాపై 196 పరుగుల తేడాతో ఓడిపోయింది.
లార్డ్స్‌లో 126 పరుగులకే ఆలౌట్ అయిన ఆస్ట్రేలియ జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2003లో సౌతాఫ్రికాపై 107 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్‌లో ఫిఫ్టీ + భాగస్వామ్యం నమోదైనా 126 పరుగులకే ఆలౌట్ కావడం ఆస్ట్రేలియాకు ఇది రెండో అత్యల్ప స్కోరు. 1985లో టీమ్ ఇండియా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 139 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ చేతిలో గత 8 మ్యాచుల్లో అస్ట్రేలియాకు ఎదురైన రెండో పరాజయం ఇది. అలాగే లార్డ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గత 9 మ్యాచుల్లో గెలవడం ఇదే మొదటిసారి.
లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌కు పరుగుల పరంగా చూస్తే ఇది రెండో భారీ గెలుపు. 1975 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాపై 202 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ సాగిందిలా - ఈ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగింది ఇంగ్లాండ్. 5 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (87), లియాన్ లివింగ్‌స్టోన్ (62*), డకెట్ (63) అర్ధ శతకాలతో రాణించారు. జామీ స్మిత్ (39), ఫిల్ సాల్ట్ (22) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 8 ఓవర్లలో ఒక్క వికెట్ తీయకుండానే 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఆడమ్ జంపా (2/66), హేజిల్‌వుడ్ (1/40), మాక్స్‌వెల్ (1/30), మిచెల్ మార్ష్ (1/26) వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మొదట ఈ జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. మొదటి వికెట్‌కు ట్రావిస్ హెడ్ (34), మిచెల్ మార్ష్ (28) 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత కంగారూల జట్టుకు ఊహించని షాక్ ఎదురైంది. మ్యాథ్యూ పాట్ (4/38), జోఫ్రా ఆర్చర్ (2/33), కార్సే (3/36), అదిల్ రషీద్ (1/11) రెచ్చిపోయారు. ఆసీస్‌ను బెంబేలెత్తించారు. దీంతో చివరి పది వికెట్లను ఆసీస్ కేవలం 58 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
ఓపెనర్లతో పాటు అలెక్స్ కేరీ (13), సీన్ అబాట్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారు మరీ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును హ్యారీ బ్రూక్ దక్కించుకున్నాడు. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2 సమంగా నిలిచింది.