ఇంగ్లాండ్ దారుణంగా కుప్పకూలిన 5 మ్యాచ్‌లు - బజ్‌బాల్ దూకుడు నిజంగా పనిచేస్తోందా? - England Team 5 Test Losses - ENGLAND TEAM 5 TEST LOSSES
England Team 5 Test Losses : శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌ని 2-1తో ఇంగ్లాండ్ గెలుచుకుంది. అయితే మూడో టెస్టులో మాత్రం ఇంగ్లాండ్ 'బజ్‌బాల్' ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం వల్ల శ్రీలంక విజయం సాధించింది. అయితే ఇంతకంటే ఇంగ్లాండ్ దారుణంగా ఎప్పుడు విఫలమైందో తెలుసా?
Published : Sep 10, 2024, 7:22 AM IST
కొన్ని సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ దూకుడు పెంచింది. ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ 'బజ్‌బాల్' విధానాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త విధానం ఇంగ్లాండ్‌కి అద్భుతమైన విజయాలనే కాదు, భారీ పతనాలు కూడా అందించింది. ప్రస్తుతం శ్రీలకంతో లండన్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అదే జరిగింది. 2024 సెప్టెంబరు 8న లండన్, ఓవల్‌లో శ్రీలంకతో జరిగిన మూడో, చివరి టెస్టులో ఇంగ్లాండ్ కుప్పకూలింది. బజ్‌బాల్ విధానంతో ఇంగ్లాండ్ ఇలా దారుణంగా పతనమైన మ్యాచ్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
శ్రీలంకతో మూడో టెస్ట్ 2024
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 263 పరుగులకు ఆలౌట్ అయింది. 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడింది. కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శ్రీలంక 219-2 పరుగులతో 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. 66-3తో ప్రారంభమైన ఇంగ్లాండ్ మిడిల్, లోయర్ ఆర్డర్ విఫలమవ్వడంతో 156 పరుగులకే కుప్పకూలింది.
దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ 2022
2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో తొలి టెస్టులో మరో తప్పిదం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 100-4తో నిలిచింది, అనంతరం 65 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులకు ఆలౌటైంది. తర్వాత దక్షిణాఫ్రికా 326 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరుగుపడలేదు. 149 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికాకు సులభమైన విజయాన్ని అందించింది. ఇది ఇంగ్లాండ్ ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్‌కి తొలి పరాజయం.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ 2022
దక్షిణాఫ్రికాతో జరిగిన అదే సిరీస్‌లో ఇంగ్లాండ్ మూడో టెస్టులో మరో సారి కప్పకూలింది. మ్యాచ్ గెలిచినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆందోళనకరంగా ఉంది. ఆలీ రాబిన్సన్ 5-49తో చెలరేగడం వల్ల దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకు పరిమితం అయింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఫలితంగా 158కి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లాండ్ చివరికి 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ గెలిచింది. సిరీస్‌ని 2-1తో సొంతం చేసుకుంది. అయినా మొదటి ఇన్నింగ్స్‌లో వారి బ్యాటింగ్ పతనం ఆటను ప్రమాదంలో పడేసింది.
భారత్‌తో నాలుగో టెస్ట్ 2024
2024లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసి, 46 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 110-3 నుంచి 145కి ఆలౌట్ అయింది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది.
భారత్‌తో ఐదో టెస్ట్ 2024
ఇదే సిరీస్‌లో చివరి ఐదో టెస్టులో ఇంగ్లాండ్ కష్టాలు కొనసాగాయి. 175-3తో పటిష్ఠంగా ఉన్న ఇంగ్లాండ్, వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయి 176-6కి చేరింది. చివరికి 218 పరుగులకే ఆలౌటైంది. భారత్ 473 పరుగుల భారీ స్కోరు చేసి, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో మాత్రమే ఇంగ్లాండ్ గెలవడం వల్ల, భారత్ 4-1తో సిరీస్‌ను గెలుచుకుంది.
అన్‌స్టాపబుల్ 'రూట్ '- సంగక్కర రికార్డ్ బ్రేక్- ఖాతాలో మరో మైల్స్టోన్ - Eng vs SL Test Series
ఇంగ్లాండ్ క్రికెటర్ అరుదైన ఘనత - 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా!