Sachin Tendulkar VS Sunil Gavaskar : ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ అనగానే అందరికీ సచిన్ తెందూల్కర్, సునీల్ గవాస్కర్ గుర్తొస్తారు. ఇద్దరూ వేర్వేరు కాలాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. సచిన్ 1989లో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా, గవాస్కర్ 1987లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
డొమెస్టిక్ క్రికెట్‌లో ఈ ఇద్దరూ ముంబయికి ఆడారు. అయినా ఎప్పుడూ సహచరులుగా లేరు. సచిన్ వచ్చిన ఏడాదికే గవాస్కర్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వీరిద్దరు ఒకే జట్టులో లేరేమో కానీ ప్రత్యర్థులుగా మాత్రం ఆడారు. ఆశ్చర్యంగా ఉందా? అది నిజమే. ఆ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ జరిగింది? విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
- 83 వర్సెస్ 99
ఈ ఇద్దరు లెజెండ్స్ తలపడ్డ మ్యాచ్ 25 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ గేమ్‌కు 1999 ఏప్రిల్ 18న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికైంది. ఈ మ్యాచ్ 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు, ఏడో వరల్డ్ కప్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న భారత జట్టుకు మధ్య నిర్వహించారు.
ఈ మ్యాచ్‌కు '83 vs 99', 'కపిల్స్ డెవిల్స్ vs అజార్స్ ఆర్మీ'గా నామకరణం చేశారు. టీవీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలానే 30 వేల మందికి పైగా ఈ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చారు. అజారుద్దీన్ జట్టులో సచిన్, కపిల్ జట్టులో గవాస్కర్ ఉన్నారు. ఇది క్రికెట్ అభిమానులకు పండగ లాంటిది. 1999 ప్రపంచ కప్‌కు ముందు ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను బాగా ఎంజాయ్ చేశారు.
ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఊహించినట్లుగానే 1999 జట్టు గెలిచింది. 90 పరుగుల తేడాతో 83 జట్టును ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో గవాస్కర్, సచిన్ ప్రత్యర్థులు కావడం విశేషం. ఆ మ్యాచ్ జరిగినప్పుడు, సచిన్ రాబోయే కాలంలో గవాస్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు సెంచరీల రికార్డు బద్దలు కొడుతాడని, అత్యధిక పరుగులను అధిగమిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.
- సెమీస్‌కు చేరలేకపోయిన ఇండియా
ఇండియా 1999 వరల్డ్ కప్ జర్నీ మే 15న దక్షిణాఫ్రికాపై ఓటమితో మొదలైంది. జింబాబ్వేతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో కూడా ఓడిపోయి ఎలిమినేషన్ అంచున నిల్చుంది. కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో తన తండ్రి అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చిన సచిన్ రాణించాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అదరగొట్టారు. భారత్ 8 మ్యాచుల్లో 4 గెలిచినా సెమీస్ చేరుకోలేకపోయింది. - 2027లో మళ్లీ వన్డే వరల్డ్ కప్
1983 తర్వాత భారత్ మరో వన్డే ప్రపంచకప్ గెలవడానికి 28 ఏళ్ల సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వచ్చింది. 2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఇండియా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడింది. 2023లో రోహిత్ సేన ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది.
టీ20 ప్రపంచకప్ నిర్వహణలో ఆర్థిక మోసాలు! - ఐసీసీ కీలక నిర్ణయం - ICC T20 Worldcup 2024
పారిస్ ఒలింపిక్స్ మస్కట్ విశేషాలివే - పెద్ద చరిత్రే ఉంది! - PARIS OLYMPICS 2024 MASCOT