Dhoni Defamation Case : తనపై మాజీ వ్యాపార భాగస్వాములు వేసిన పరువు నష్టం దావాను కొట్టేయాలని దిల్లీ హైకోర్టుకు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నివేదించాడు. ఆ పిటిషన్ విచారణకు అర్హత లేదని అందులో పేర్కొన్నాడు. ఈ మధ్యే మహీ మాజీ బిజినెస్ పార్ట్నర్స్ మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్యాదాస్ హైకోర్టులో ఈ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. మహీతో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మీడియా సంస్థలు తమ పరువుకు భంగం కలిగించాయని, అందుకే వారిపై నష్టపరిహారం పాటు ఎలాంటి కథనాలు ప్రచురించకుండా నిరోధించాలని ఆ పిటిషన్‌లో వారు కోరారు.
ఈ నేపథ్యంలో తాజాగా ధోనీ తరఫున ప్రతినిధులు హైకోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. తాము రాంచీ న్యాయస్థానంలో సదరు మాజీ బిజినెస్ పార్ట్నర్స్పై పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే మహీపై వారు పరువునష్టం దావా వేసినట్లు కోర్టుకు తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు, డాక్యుమెంట్లు అందలేదని, హైకోర్టు రిజిస్ట్రీ ద్వారానే కేసు నమోదైనట్లు తెలిసిందన్నారు.
వీరి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మూడు రోజుల్లో ధోనీ న్యాయవాదులకు పిటిషన్‌దారుల తరఫున న్యాయవాది డాక్యుమెంట్లను అందించాలని ఆదేశించింది. ప్రస్తుతం ధోనీతో పాటు మీడియా సంస్థలు, పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వ్యతిరేకంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. అయితే, పిటిషన్‌దారుల పరువుకు నష్టం కలిగించేలా కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశిస్తామని చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
ఐపీఎల్ ధోనీ రిటైర్మెంట్(Dhoni IPL Retirement) : ఇకపోతే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి జరుగుతున్న ప్రచారంపై సీఎస్కే ప్లేయర్ దీపర్ చాహర్ తాజాగా స్పందించాడు. మహీ క్రికెట్‌కు ఇవ్వాల్సింది చాలా ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ధోనీ మరో రెండు, మూడు సీజన్లు ఆడగలడని పేర్కొన్నాడు. నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్ చూశానని, చాలా సహజంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.