Cricketers Born In India T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024 భారీ అంచనాలతో మొదలైంది. యువ క్రికెటర్లు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు టోర్నమెంట్‌లో అడుగుపెట్టారు. ఓపెనింగ్ మ్యాచ్‌లోనే కొత్త జట్టు యూఎస్ఏ, కెనడాను ఢీ కొట్టింది. తాజాగా గురువారం మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ నెగ్గి పొట్టి ప్రపంచకప్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది.
అయితే ప్రతి ఐసీసీ టోర్నీలో చాలా జట్లలో భారత మూలాలున్న ప్లేయర్లు ఆడడం సహజంగా మారిపోయింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), తేజ నిడమనూరు (నెదర్లాండ్స్) లాంటి దేశాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు తాజా టీ20 వరల్డ్‌కప్‌లోనూ భారత మూలాలున్న పలువురు ఆటగాళ్లు ఇతర దేశాల తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరంటే?
సౌరబ్ నేత్రావల్కర్, యూఎస్ఏ: ముంబయిలో పుట్టిన సౌరభ్ నేత్రావల్కర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. 32 ఏళ్ల సౌరభ్ 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మతో కలిసి ఆడాడు. ముంబయి తరపున దేశీవాలీ క్రికెట్‌లో కూడా ఆడి టీమ్ఇండియాలో అవకాశాలు రాకపోవడం వల్ల యూఎస్ఏ (USA)కు వెళ్లి ఇంజినీరింగ్ చదువుకున్నాడు. అక్కడ క్రికెటింగ్ కెరీర్ బాగుండటంతో యూఎస్ఏ టీమ్‌లో సీనియర్లతో కలిసి ఆడుతున్నాడు.
నిసర్గ్ పటేల్, యూఎస్ఏ: యూఎస్ఏ జట్టులో ఇంకో సభ్యుడు నిసర్గ పటేల్. అహ్మదాబాద్‌లో పుట్టిన నిసర్గ 2018 నుంచి యూఎస్ఏకు ఆడుతున్నాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, రైట్ హ్యాండెడ్ బ్యాటర్. ఇప్పటివరకూ అమెరికా తరపున 41 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
మోనాంక్ పటేల్, యూఎస్ఏ కెప్టెన్: యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా భారత్‌కు చెందిన వ్యక్తే. గుజరాత్‌కు చెందిన ఇతడు వికెట్ కీపర్ కూడా. ఇప్పటివరకూ 23 టీ20లు ఆడిన పటేల్ 457 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
దినేశ్ నక్రానీ, ఉగాండా: అమెరికాతో పాటు ఉగాండా కూడా ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో అరంగ్రేటం చేసింది. అందులో కూడా ఇతర దేశాల ప్లేయర్లను చేర్చుకుంది. ఉగాండా టీమ్‌లో దినేశ్ నక్రానీ కూడా గుజరాత్‌కు చెందిన వ్యక్తే. ఇతడు ఛెతేశ్వర్ పూజారాతో దేశీవాలీ క్రికెట్ కూడా ఆడాడు.
నవనీత్ ధాలీవాల్, కెనడా: టీ20 వరల్డ్ కప్ 2024తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మరో టీమ్ కెనడా. కెనడియన్ జట్టులో ఉన్న కొద్ది మంది క్రికెటర్లలో నవనీత్ ధాలీవల్ ఒకడు. చండీగఢ్‌లో పుట్టిన నవనీత్ మిడిలార్డర్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేసర్. టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగి 61 పరుగులతో రాణించాడు.