Changes In Paris Olympics 2024 : టోక్యో ఒలింపిక్స్ (2020) తర్వాత ఇప్పుడు పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకూ ఈ ప్రతిష్టాత్మక క్రీడలు అట్టహాసంగా జరగనున్నాయి. అయితే ఈ రెండేళ్ల మధ్యలో భారత్ నుంచి వివిధ క్రీడలకు ప్రాతినిథ్యం వహించనున్న ఒలింపిక్స్ బృందాల్లో చాలా మార్పులు జరిగాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పతక విజేతలు తిరిగొస్తున్నారు
టోక్యోలో పతకాలు గెలిచిన ఏడుగురిలో ఐదుగురు పారిస్‌లోనూ పోటీ పడనున్నారు. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), లోవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్), పురుషుల హాకీ జట్టు మళ్లీ ఒలింపిక్ మెడల్ గెలిచే లక్ష్యంతో ఉన్నారు. వీళ్లందరికీ మెడల్ గెలిచే సత్తా ఉంది.
ఇందులో నీరజ్, లోవ్లినా వారి విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌లుగా కొనసాగుతున్నారు. మీరాబాయి, సింధు, మాజీ ప్రపంచ ఛాంపియన్‌లు. వీరిని ఇటీవల గాయాలు కలవరపెట్టినా, మెడల్ కొట్టే స్కిల్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. హాకీ జట్టు కూడా గందరగోళాన్ని అధిగమించి, గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. పారిస్‌లో ఎక్కువ మంది మల్టిపుల్ ఒలింపిక మెడలిస్ట్స్‌ని చూసే అవకాశం ఉంది.
ఈ సారి కసిగా బరిలోకి!
టోక్యోలో పతకాలు గెలవడంలో విఫలమైన అథ్లెట్లు కొందరు, ఈ సారి కచ్చితంగా విజయం సాధించాలనే కసితో ఉన్నారు. వారెవంటే?
వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్) : మోకాలి శస్త్రచికిత్సతో ఆసియా క్రీడలకు దూరమైంది. WFI మాజీ చీఫ్ లైంగిక వేధింపుల ఆరోపణలకు జరిగిన నిరసనల్లో పాల్గొంది. మానసిక, ఆరోగ్య పోరాటాలను అధిగమించి పారిస్ బరిలో దిగుతోంది. ఒలింపిక్ బెర్త్ కోసం బరువు తగ్గించుకుని 50 కిలోల కేటగిరీలో పోటీ పడుతోంది.
మను భాకర్ (షూటింగ్) : ఈ స్టార్ షూటర్ పారిస్ ఒలింపిక్స్కోసం తిరిగి తన మాజీ కోచ్‌తో కలిసి పని చేస్తోంది. ఈ టోర్నీలో మూడు ఈవెంట్‌లలో తన అదృష్టం పరీక్షించుకోనుంది.
దీపికా కుమారి (ఆర్చరీ) : రెండేళ్ల క్రితం తల్లైన ఈ మాజీ ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి , 30 ఏళ్ల వయసులో నాలుగో ఒలింపిక్స్ ఆడుతోంది. ప్రసూతి విరామం తర్వాత శిక్షణ కోసం బిడ్డకు దూరంగా ఉండి, దక్షిణ కొరియాలోని అత్యుత్తమ ఆర్చరీ అకాడమీకి వెళ్లింది.
అదితి అశోక్ (గోల్ఫ్) : 26 సంవత్సరాల వయస్సులో తన మూడో ఒలింపిక్స్ ఆడుతోంది. టోక్యో 2020లో నాలుగో స్థానంలో నిలిచింది. పారిస్‌లో కచ్చితంగా పతకం గెలవాలనే లక్ష్యంతో ఉంది.
అమిత్ పంఘల్ (బాక్సింగ్) : టోక్యోలో ఫస్ట్-బౌట్‌లోనే నిష్క్రమించాడు. భారత జట్టులోకి తిరిగి రావడానికి కొత్త మూల్యాంకన వ్యవస్థతో పోరాడాడు. రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు.
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్ డబుల్స్) : టోక్యోలో త్రీ-వే టై టెక్నాలజీ కారణంగా (ఛాంపియన్‌లను కూడా ఓడించినప్పటికీ) ఊహించని రీతిలో గ్రూప్-స్టేజ్‌లో బయటకు వచ్చారు. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన జోష్‌లో కూడా ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని, పారిస్‌కి అర్హత సాధించని ప్రముఖ అథ్లెట్లు వీరే
బజరంగ్ పునియా, రవి దహియా (రెజ్లింగ్) : పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు.
మేరీ కోమ్ (బాక్సింగ్) : వయోపరిమితి కారణంగా ఆమె పోటీలకు దూరమైంది.
భవానీ దేవి (ఫెన్సింగ్) : అర్హత సాధించలేదు.
కమల్‌ప్రీత్ కౌర్ (డిస్కస్ త్రో) : డోపింగ్ నిషేధాన్ని ఎదుర్కొంటోంది.
మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్) : గాయం కారణంగా ఈ ఒలింపిక్స్‌కు హాజరుకావట్లేదు.
ద్యుతీ చంద్ (స్ప్రింటింగ్) : డోపింగ్ నిషేధం
సానియా మీర్జా (టెన్నిస్) : ఈమె తాజాగా తన రిటైర్మెంట్ ప్రకటించింది.
భారత మహిళల హాకీ జట్టు : టోక్యోలో బలమైన ప్రదర్శన చేసినప్పటికీ, పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంలో విఫలమైంది.
తొలిసారి బరిలోకి
భారత్‌కు పతకాలు సాధించగలన్న ధీమాతో పలు ప్లేయర్లు తమ ఒలింపిక్ అరంగేట్రం చేసేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో కీలకం ఎవరంటే?
నిఖత్ జరీన్ (బాక్సింగ్) : 51 కేజీల్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది నిఖత్.
సిఫ్ట్ కౌర్ సమ్రా (షూటింగ్): మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో ఆసియా క్రీడల ఛాంపియన్ ఈమె.
అంతిమ్ పంఘల్ (రెజ్లింగ్) : మహిళల 53 కేజీల విభాగంలో ఒలింపిక్ కోటాను గెలుచుకున్న తొలి భారతీయ రెజ్లర్.
అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్) : ఛత్రసాల్‌కి చెందిన ఇతను ప్రపంచ U23 ఛాంపియన్. ఆరో సీడ్. మెడల్ రౌండ్స్‌లోకి రావడానికి ముందు రెండు కఠినమైన బౌట్‌లను ఎదుర్కొంటాడు.
రూ.15,490 కోట్లతో క్రీడా గ్రామం - అథ్లెట్ల కోసం 3 లక్షల కండోమ్‌లు! - Paris Olympics 2024