Champions Trophy 2025 Teamindia Tour To Pakisthan : పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై చాలా కాలం నుంచి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై మరోసారి ఓ పీసీబీ అధికారి మాట్లాడారు.
భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియాను పంపించడానికి భారత ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే, ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలపాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు సదరు అధికారి తెలిపారు. టోర్నీకి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని, దాన్ని తెలియజేయాలని పాక్ బోర్డు విజ్ఞప్తి చేసినట్లు అన్నారు.
"భారత ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తే, బీసీసీఐ దాన్ని రాతపూర్వకంగా లేఖను ఐసీసీకి సమర్పించాలి. కనీసం 5-6 నెలల ముందే పాకిస్థాన్ పర్యటన విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఐసీసీకి తెలియజేయాలి." అని ఓ పీసీసీ అధికారి తెలిపారు.
కాగా, భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా భారత జట్టు మ్యాచ్‌లు లాహోర్ స్టేడియంలో ఆడేలా పాకిస్థాన్ షెడ్యూల్ చేసినప్పటికీ అక్కడికి వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదని తెలిసింది. భారత్ ఆడే మ్యాచ్‌లను గతంలో ఆసియాకప్ తరహాలో వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు తెలుస్తోంది.
చివరిసారిగా అప్పుడే - ఇకపోతే భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల చాలా ఏళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదు. భారత జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్ కోసం అక్కడికి వెళ్లింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసమైన భారత్ తమ దేశానికి వస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హైబ్రిడ్ మోడల్‌కు ICC నో చెప్తే భారత్ పరిస్థితేంటి?- లంకకు బిగ్ ఛాన్స్! - 2025 Champions Trophy