Border Gavaskar Trophy TeamIndia Middle Order Issue : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి సమయం దగ్గరపడింది. మరో రోజులో ప్రారంభం కానుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ టీమ్ ఇండియా సంచలన విజయాలతో సిరీస్ సాధించింది. ఇప్పుడు అక్కడ హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సారి విజయం అంత తేలిక కాదు! టీమ్ ఇండియాను కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో మిడిలార్డర్ బలహీనత కూడా ఒకటి.
అప్పట్లో వారు ఓకే, కానీ ఇప్పుడెవరు? - టెస్టు క్రికెట్లో మిడిలార్డర్ బ్యాటింగ్ ఎంతో కీలకం. టాప్ ఆర్డర్ అందించిన మంచి శుభారంభాలను కొనసాగిస్తూ జట్టుకు మెరుగైన స్కోర్ అందించడం లేదంటే టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు బలంగా నిలబడి జట్టును ఆదుకోవడం ఈ మిడిలార్డర్ బాధ్యత.
90వ దశకం నుంచి కొన్నేళ్ల పాటు గంగూలీ, లక్ష్మణ్ మిడిలార్డర్‌ను సమర్థంగా నిర్వహించారు. ఆ తర్వాత ధోనీ, అనంతరం అతడికి రహానే తోడు అంతా బానే సాగింది. అయితే రహానే నిష్క్రమణ తర్వాత మిడిలార్డర్‌లో కాస్త స్థిరత్వం తగ్గింది. ప్రస్తుత సిరీస్‌లో అయితే ఈ మిడిలార్డర్ చాలా బలహీనంగా ఉండడంతో పాటు అనుభవ లేమితో కనిపిస్తోంది.
అతడిపైనే ఆశలు! - ప్రస్తుత మిడిలార్డర్‌లో రిషబ్ పంత్ కాస్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. 2019లో సిడ్నీలో సాధించిన 159 పరుగుల ఇన్నింగ్స్, గత సిరీస్ చివరి మ్యాచ్‌లో 89 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ను అంత ఈజీగా మార్చిపోలేము.
అయితే ప్రస్తుత సిరీస్ ముందు పంత్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత పునరాగమనంలో మోస్తరు ప్రదర్శన కనబరుస్తున్నాడు. కాబట్టి ఈ సారి గత పర్యటన స్థాయి మెరుపులను మెరిపిస్తాడో లేదో చూడాలి. ఏదేమైనా తనపై అంచనాలు లేనపుడు అద్భుతంగా ఆడి ఆశ్చర్యపరచడం పంత్‌కు అలవాటు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
కేఎల్ రాహుల్ సహకారం - ఇకపోతే మిడిలార్డర్లో పంత్‌కు సరైన సహకారం అందాలి. మరి ఇది అతడికి అందుతుందా అన్నది అనుమానమే. కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అయినప్పటికీ సీనియారిటినీ దృష్టిలో పెట్టుకుని అతడిపై జట్టు ఆధారపడుతుంది. కానీ తొలి టెస్ట్‌కు కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేకపోవడం వల్ల రాహుల్ ఓపెనర్‌గా వస్తాడు. దీంతో ధ్రువ్ జురెల్‌కు మిడిలార్డర్‌లో అవకాశం రావొచ్చు. ఇంకా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని ప్రచారం సాగుతోంది. సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరికి ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేదు. చూడాలి మరి ఏం చేస్తారో.
ఒకవేళ తొలి టెస్ట్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా, రాహుల్ కిందికి వస్తాడా లేదా అన్నది డౌటే. ఎందుకంటే మరో టాప్ ఆర్డర్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. అతడు ఎప్పుడు కోలుకుంటాడో క్లారిటీ లేదు. అయినా ఒకవేళ రాహుల్ మిడిలార్డర్లోకి వచ్చినా, అతడు ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఎలా రాణిస్తాడనేది సందేహమే.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, బోలాండ్ తమ పేస్‌తో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. పిచ్ ఎలా ఉన్నా కూడా బంతిని తిప్పి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి స్పిన్నర్ నాథన్ లైయన్ ఉన్నాడు. పైగా పిచ్‌లు ఆస్ట్రేలియాకు సహకరిస్తాయి. అవి భారత బ్యాటర్లకు పరీక్ష పెడతాయి కాబట్టి, ముఖ్యంగా మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి తప్పదనే చెప్పాలి. చూడాలి మరి కంగారులను భారత మిడిలార్డర్ ఎలా ఎదుర్కొంటుందో.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి బుమ్రా స్పెషల్ ఛాయిస్ - సర్‌ప్రైజ్ ఫైనల్ XI ఇదేనా?
'అలా చేస్తే నీకేమైనా డబ్బులు వచ్చాయా?' - అతడికి గట్టి కౌంటర్ ఇచ్చిన కుల్దీప్ యాదవ్