Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్‌గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ బరిలో దిగనున్నాడు. అతడు ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) ఈవెంట్‌లో ఈజిప్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో మొత్తం మూడు విభాగాలుండగా, జంపింగ్ వ్యక్తిగత విభాగంలో నాజర్ పోటీ పడుతున్నాడు. ఆగస్టు 5న ఈ మ్యాచ్ జరగనుంది. నాయెల్ నాజర్ గతంలోనూ ఈజిప్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు.
కాగా, నాజర్ ఈజిప్టియన్- అమెరికన్ సిటిజన్. అతడు ఐదేళ్ల నుంచే గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. 10ఏళ్ల వయసులో ఈక్వెస్ట్రియన్ జంపింగ్ చేయడం మొదలుపెట్టాడు. 2013, 2014, 2017లో FEI వరల్డ్‌కప్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. నాజర్ తల్లిదండ్రులు ఈజిప్టుకు చెందిన వారు కావడం వల్ల ఒలింపిక్స్‌లో అదే దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక నాజర్ 2013లో స్టాన్‌ఫర్డ్ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందాడు. ఈక్వెస్ట్రియన్ పోటీల సమయంలోనే బిల్ గేట్స్ పెద్ద కూతురు జెన్నిఫర్ గేట్స్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి, కొన్నేళ్లు డేటింగ్లో ఉన్నారు. ఇక 2021లో వీరిద్దరికి వివాహం జరిగింది.
బీజేపీ ఎమ్మేల్యే కూడా
బిహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ కూడా పారిస్ ఒలింపిక్స్‌లో బరిలో దిగనున్నారు. ఆమె షూటింగ్ క్రీడాకారిణి. కాగా శ్రేయసి బిహార్ నుంచి పారిస్ ఒలిపింక్స్‌కు ఎంపికైన తొలి మహిళా అథ్లెట్. ఓవరాల్‌గా బిహార్ నుంచి ఈమె రెండో అథ్లెట్. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియన్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో బరిలో దిగనున్నారు.