IPL 2025 Mega Auction: 2025 ఐపీఎల్ మెగా వేలం ఈ ఏడాది చివర్లో జరగనుంది. దీనికి ముందు బీసీసీఐ, అన్ని ఫ్రాంఛైజీలతో కీలక అంశాలు చర్చించేందుకు సిద్ధమైంది. మొత్తం పది ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులతో జులై 31న సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా ఫ్రాంఛైజీలు వేలానికి ముందు ఎంత మంది ప్లేయర్స్‌ను ఉంచుకోవచ్చు(రిటెన్షన్స్), రైట్ టు మ్యాచ్ (RTM) ఆప్షన్లపై చర్చ జరుగనుంది.
ఫ్రాంచైజీలతో సమావేశానికి సిద్ధం
జులై 31న జరిగే సమావేశానికి సంబంధించి ఐపీఎల్ సీఈఓ అమిన్ గురువారం ఉదయం ఫ్రాంఛైజీ యజమానులకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపారని క్రిక్‌బజ్ ఓ నివేదికలో పేర్కొంది. మీటింగ్ వెన్యూ, సమయం తెలియజేసే ఫార్మల్ ఇన్విటేషన్ ఈ మెసేజ్‌లో పంపినట్లు పేర్కొంది. 31న మధ్యాహ్నం లేదా సాయంత్రం సమావేశం జరుగుతుందని అమీన్ చెప్పినట్లు తెలిసింది. దీనికి యజమానులందరూ సమావేశానికి అందుబాటులో ఉంటామని కన్‌ఫర్మ్ చేశారని సమాచారం. కచ్చితమైన వేదిక ఇంకా నిర్థారించనప్పటికీ, ముంబయిలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్‌లో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయం క్రికెట్ సెంటర్‌లో మీటింగ్ జరగవచ్చని క్రిక్‌బజ్ తెలిపింది.
2022లో మారిన నిబంధనలు
ఐపీఎల్ 2018 మెగా వేలం సమయంలో ఫ్రాంఛైజీలు ఐదుగురు ఆటగాళ్ల వరకు రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో వేలం నుంచి నేరుగా ముగ్గురు ఆటగాళ్లను, మిగిలిన ఇద్దరిని రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌ను ఉపయోగించి తీసుకోవచ్చు. అయితే 2022లో రెండు కొత్త జట్లు, గుజరాత్ టైటాన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రవేశించాయి. దీంతో నిబంధనలు కాస్త మారాయి. RTM కార్డ్ ఆప్షన్ తొలగించారు. కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.
అలా అయితే వేలంపై ఆసక్తి ఉండదు
అయితే ఇప్పుడు ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి బీసీసీఐ ఫ్రాంఛైజీలను అనుమతించవచ్చని నివేదిక పేర్కొంది. కానీ ఫ్రాంఛైజీలు మాత్రం 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేలా వెసులుబాటును కల్పించాలని కోరబోతున్నట్లు తెలిసింది. ఒకవేళ నిజంగానే ఇలా చేస్తే వేలంపై ఆసక్తి పోతుందని, అందుకే రిటెన్షన్స్‌ను లిమిట్ చేస్తారని క్రిక్‌బజ్ వెల్లడించింది. ప్రతి జట్టుకు ఎనిమిది మంది ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఇస్తే, ఇతర దేశాలు, భారత్‌కు చెందిన 80 మంది బెస్ట్ ప్లేయర్స్ వేలంలో భాగం కారు. దీంతో మెగా ఆక్షన్‌పై ఆసక్తి పోతుందని చెప్పింది. ఇక రైట్ టు మ్యాచ్ (RTM) ఆప్షన్ అనేది కాంట్రవెర్షియల్ టాపిక్. సమావేశంలో దీని గురించి చర్చించవచ్చు. అయితే ఈ అంశంపై బీసీసీఐ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది.
ఫ్రాంచైజీల బడ్జెట్‌పై చర్చ
మరోవైపు ఒక్కో జట్టు బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం, ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ వరుసగా రూ.24.75 కోట్లు, రూ.20.50 కోట్లకు అమ్ముడు పోయారు. టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు. దీంతో ఈ సీజన్లోనూ క్యాష్ ఫ్లో పెరుగుతుందని బీసీసీఐ అర్థం చేసుకుని, వచ్చే సీజన్‌లో బడ్జెట్‌ను రూ.120- 130 కోట్లకు పెంచే యోచనలో ఉందని నివేదిక తెలిపింది. సమావేశంలో దీనిపై కూడా చర్చ జరగనుంది.
ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ - ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? - Paris Olympics 2024
పాకిస్థాన్ పర్యటనపై బీసీసీఐ ఆలోచన ఇదే - అదనపు నిధులు కేటాయించిన ఐసీసీ! - Champions Trophy 2025