BCCI Inaugurates New NCA : దేశంలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందడానికి వీలుగా బీసీసీఐ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)ని ఆదివారం ప్రారంభించింది. భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు బీసీసీఐ ఈ కొత్త క్రికెట్ ఆకాడమీని నిర్మించింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్న ఈ ఎన్సీఏ దేశంలో క్రికెట్ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బీసీసీఐ భావిస్తోంది. ఈ ఎన్‌సీఏలో ఏయే సదుపాయాలు ఉన్నాయంటే?
40ఎకరాలకుపైగా విస్తీర్ణం
40ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న కొత్త ఎన్‌సీఏలో మూడు ప్రపంచస్థాయి క్రీడా మైదానాలు, ఇండోర్, అవుట్ డోర్ కలిపి 86 పిచ్‌లు ఉన్నాయి. గ్రౌండ్ A లోని మైదానం 85 గజాల బౌండరీని కలిగి ఉంది. దీన్ని ముంబయి ఎర్రమట్టితో నింపారు. అధునాతన ఫ్లడ్ లైటింగ్, అత్యాధునిక ప్రసార సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఫ్లడ్ లైట్ల కింద మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చు. గ్రౌండ్ B, Cలోని స్టేడియాలు 75 గజాల బౌండరీలో ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ గ్రౌండ్లుగా పనిచేస్తాయి. వీటిని మాండ్య మట్టి, ఒడిశాలోని బ్లాక్ కాటన్ మట్టితో నింపారు.
వర్షం పడినా నో టెన్షన్!
మైదానంలో వర్షం పడినా నీరు త్వరగా ఇంకిపోయేందుకు, కొత్త నేషనల్ క్రికెట్ ఆకాడమీలో సబ్ సర్ఫేస్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే తెల్లటి పికెట్ ఫెన్సింగ్ వేశారు. ఈ గ్రౌండ్లు అచ్చం ఇంగ్లీష్ కౌంటీ పిచ్‌లానే కనిపిస్తున్నాయి. ఎన్‌సీఏలో 45 అవుట్ డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్ లు ఉన్నాయి. వీటన్నింటినీ UK నుంచి తెప్పించిన సేఫ్టీ నెట్స్‌తో వేరు చేశారు. అలాగే ఆరు అవుట్ డోర్ రన్నింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.
వాతావరణ పరిస్థితులతో నో వర్రీ!
ఇండోర్ పిచ్‌లలో ఏర్పాటు చేసిన పెద్ద, కఠినమైన గాజు పలకలు సహజ కాంతిని అందిస్తాయి. వీటిల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు ఆటను క్యాప్చర్ చేస్తాయి. వాతావరణం లేదా టైమ్‌తో సంబంధం లేకుండా ఇండోర్ స్టేడియాల్లో అథ్లెట్లు శిక్షణ పొందొచ్చు.
పెద్ద డ్రెస్సింగ్ రూమ్
అలాగే ఎన్‌సీఏలో దాదాపు 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అతిపెద్ద డ్రెస్సింగ్ రూమ్, లాంజ్, మసాజ్ రూమ్, కిట్ రూమ్, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అలాగే అత్యాధునిక సదుపాయాలతో కామెంటరీ, మ్యాచ్ రిఫరీ గదులు, విశాలమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏరియా, వీఐపీ లాంజ్, డైనింగ్ ఏరియా, పరిపాలనా భవనాలు ఉన్నాయి.
జిమ్, స్విమ్మింగ్ పూల్ కూడా
స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ (SSM) బ్లాక్ లో 16,000 చదరపు అడుగుల జిమ్ ఉంది. ఇందులో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. అలాగే నాలుగు అథ్లెటిక్ ట్రాక్ లు, ఫిజియోథెరపీ రిహాబ్ జిమ్, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ ల్యాబ్, పూల్ స్పా, కోల్డ్ షవర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 25x12 మీటర్ల స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీకి శంకుస్థాపన చేసిన గంగూలీ
వీవీఎస్ లక్ష్మణ్ రూట్ ఎటు? - అతడిని బీసీసీఐ ఒప్పిస్తుందా? - Teamindia Head coach