Ind vs Aus 3rd Test : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టు డ్రా గా ముగిసింది. 275 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ టీ విరామ సమయానికి భారత్ 8-0తో నిలిచింది. ఆటకు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్‌ను డ్రా గా ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరుజట్లు 1- 1తో సమంగా నిలిచాయి. భారీ సెంచరీతో అదరగొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించింది.
ఐదో రోజు ప్రారంభం నుంచే ఆటకు వర్షం అంతరాయం కలిగింది. ఓవర్‌నైట్ స్కోర్ 252-9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 8 పరుగులు జోడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 260-10. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అవ్వడానికి ముందు మళ్లీ వర్షం అడ్డుకుంది.
వర్షం వల్ల తొలి సెషన్‌లో దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆడేయడం ప్రారంభించింది. టీమ్ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాలనే ఉద్దేశంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చారు. కానీ, భారత బౌలర్ల దెబ్బకు వారి ప్రణాళికలు పటాపంచలు అయ్యాయి. ఈ క్రమంలోనే టీమ్ఇండియా బౌలింగ్ దళం ఎవరినీ కుదురుకోనీయకుండా పెవిలియన్‌కు చేర్చింది.
The play has been abandoned in Brisbane and the match is drawn.
— BCCI (@BCCI) December 18, 2024
After the Third Test, the series is evenly poised at 1-1
Scorecard - https://t.co/dcdiT9NAoa#TeamIndia | #AUSvIND pic.twitter.com/GvfzHXcvoG
ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 89-7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ 185 పరుగులు కలుపుకొని భారత్‌కు 275 రన్స్ టార్గెట్ నిర్దేశించింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మళ్లీ వర్షం పలకరించింది. ఇక వర్షం తగ్గే సూచనలు లేకపోవడం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇక భారత్- ఆసీస్ మధ్య నాలుగో టెస్టు డిసెంబర్ 26న ప్రారంభం కానుంది.
నాలుగో టెస్టుకు హెడ్ దూరం
ఈ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా హెడ్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే మ్యాచ్‌లకు హెడ్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.