Afghanistan Emerging Asia Cup Title : ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టోర్నీ విజేతగా అఫ్గానిస్థాన్ జట్టు అవతరించింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక-ఏపై అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. బిలాల్ సమీ (3/22), అల్లా ఘజన్‌ఫర్ (2/14) అద్భుతంగా బౌలింగ్ చేసి లంకను కట్టడి చేశారు.
లంక ఇన్నింగ్స్‌లో సహన్ అరచ్చిగే (64* నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా, పవన్ రత్నాయకే (20), నిమేశ్ విముక్తి (23) రెండంకెల స్కోర్లు చేశారు. యశోధ లంక (1), లహీరు ఉదార (5), నువనిదు ఫెర్నాండో (4), అహన్ విక్రమసింఘే (4), రమేశ్ మెండిస్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమై విఫలమయ్యారు. చివర్లో దుషన్ హేమంత 6 పరుగులతో అజేయంగా నిలిచాడు. పవన్ రత్నాయకే, నిమేశ్ విముక్తి రనౌట్ అయ్యారు.
అనంతరం 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ 18.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సెదికుల్లా అటల్ (55* నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో అఫ్గాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24), మహ్మద్ ఇషాక్ (16* నాటౌట్) రాణించారు.
లంక బౌలర్లలో సహన్ అరచ్చిగే, దుషన్ హేమంత, ఎషాన్ మలింగ తలో వికెట్ దక్కించుకున్నారు. అద్భుతమైన స్పెల్‌తో (2/14)లంకను కట్టడి చేసిన అల్లా ఘజన్‌ఫర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ ఆధ్యంతం అద్భుతంగా రాణించిన సెదికుల్లా అటల్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు వరించింది.
ఈ 5 యంగ్ ప్లేయర్స్‌కు భలే ఛాన్స్ - టీమ్ ఇండియాలో స్థిరపడతారా?