2026 Commonwealth Games : గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్‌ను తొలగించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ప్రకటన చేసింది. దీంతో క్రీడాభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ముఖ్యంగా భారత అభిమానులు ఈ నిర్ణయం పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2022లో బర్మింగ్‌హామ్ వేదికగా 19 ఈవెంట్‌లను నిర్వహించారు. అయితే, ఈ సారి మాత్రం ఖర్చులను తగ్గించుకోవడానికి 10 ఈవెంట్‌లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ కామన్వెల్త్ క్రీడలు 2026లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్నాయి. వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, తాజాగా కామన్వెల్త్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు ఒకరకంగా ఇబ్బందికరమే అని క్రీడానిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ, క్రికెట్, షూటింగ్ లాంటి క్రీడల్లో భారత్‌కు పతక అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడీ క్రీడాంశాలను తొలగించడం వల్ల మెడల్స్ సంఖ్య గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలు సాధించి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. అందులో 22 గోల్డ్, 16 సిల్వర్, 23 బ్రాంజ్ మెడల్స్ ఉండటం విశేషం. రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు సాధించగా, వెయిట్ లిఫ్టింగ్‌లో 10 మెడల్స్ వచ్చాయి.
హాకీపైనే అన్ని ఆశలు!
అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో నుంచి హాకీ ఆటను తొలగించడం భారత్‌కు పెద్దదెబ్బ తగిలినట్లవుతుంది. ప్రతిసారి భారత్ పతకం సాధించే క్రీడాంశాల్లో హాకీ తప్పకుండా ఉంటుంది. అలా ఈసారి కూడా భారత హాకీ జట్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ పోటీల్లో పురుషుల హాకీ జట్టు ఇప్పటిదాకా మూడుసార్లు సిల్వర్, రెండుసార్లు బ్రాంజ్ పతకాలు సాధించింది. భారత హాకీ జట్టు రీసెంట్గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు, రీసెంట్గా 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణం ముద్దాడింది.
భారత్‌కు షాక్- కామన్వెల్త్ గేమ్స్‌లో నో హాకీ!- కారణం అదే
Commonwealth Games 2026: షూటింగ్ ఇన్.. రెజ్లింగ్ ఔట్.. భారత్ మెడల్స్‌పై ఎఫెక్ట్ ఉంటుందా?