Yama Aditya Temple Kashi Significance : కాశీ పట్టణం పేరు స్మరిస్తేనే చాలు సమస్త పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితమంతా ఎలా గడిచినా చివరి రోజులు కాశీలో గడపాలని, కాశీలోనే మరణించాలని ఎంతో మంది ఆరాటపడుతుంటారు. కాశీలో మట్టి, గంగా తీర్థం, విశ్వేశ్వర స్వామి లింగం, అన్నపూర్ణాదేవి ఆలయం, డుంఠి గణపతి, చింతామణి గణపతి, కాలభైరవుడి ఆలయం ఇలా ఒకటేమిటి ఎన్నో విశేషాలకు నిలయం కాశీ పట్టణం. ఇలాంటి కాశీ పట్టణంలో వెలసిన సూర్యదేవాలయాలు కూడా ఎంతో ప్రత్యేకమే!
12 సూర్య ఆలయాలు
కాశీ పట్టణంలో 12 సూర్యుని ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ పూజలందుకుంటున్నాడు. కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు, అక్కడి యమాదిత్యుడిని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. అసలేమిటి యమాదిత్యుని ప్రత్యేకత? ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
యమాదిత్యుని ఆలయ విశేషాలు
శ్రీనాథుడు రచించిన కాశీ ఖండంలో యమాదిత్యుని ఆలయ విశేషాల గురించిన ప్రస్తావన ఉంది. సింధియా ఘాట్‌లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు ఒకసారి తన భటులను పిలిచి, శ్రీమహావిష్ణువును అనునిత్యం ఆరాధించే మహా భక్తుల జోలికి వెళ్లొద్దని చెప్పాడట. యమధర్మరాజు మాటలు విస్మరించిన యమ భటులు సూర్యభగవానుడి భక్తుడైన సత్రాజిత్తు దగ్గరికి వెళ్లి, సూర్యుని ఆగ్రహానికి గురవుతారు. జరిగిన విషయం తెలుసుకున్న యమధర్మరాజు, యమ భటుల అపరాధాన్ని మన్నించమని సూర్యభగవానుడిని కోరుతూ అందుకు ప్రాయశ్చిత్తంగా సూర్యభగవానుని మూర్తిని కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాడు.
అందుకే యమాదిత్యుడు
కాశీలో యమధర్మరాజు సూర్యుని సేవిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కాబట్టి ఇక్కడి సూర్యభగవానుడు యమాదిత్యుడుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే యమధర్మరాజు తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేసి విశ్వనాథుని దర్శన భాగ్యం పొందాడు. ఇక్కడ యముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని యమేశ్వర స్వామి అంటారు. కాశీలో శ్రీ యమేశ్వర స్వామిని, యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకొంటే, శాశ్వత స్వర్గ ప్రాప్తి లభిస్తుందని శాస్త్రవచనం.
యమయాతనలు దూరం
అలాగే కాశీలోని యమాదిత్యుని దర్శనం చేసుకున్నవారికి మరణాంతరం యమ యాతనలను అనుభవించవలసి అవసరం లేదనేది మహర్షుల మాట.
యమాదిత్యుని దర్శనానికి ఈరోజే శ్రేష్టం
మంగళవారంతో కూడిన చతుర్దశి రోజున గంగానదిలో స్నానమాచరించి, యమాదిత్యుడిని దర్శించుకున్నవారు, సమస్త పాపాల నుంచి విముక్తులవుతారని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఈ దేవుడిని పూజిస్తే భయంకరమైన వ్యాధులు కూడా నయం! ఎక్కడుందో తెలుసా? - Vimal Aditya Temple Kashi