Which Prasadam Lord Ganesha Likes: వినాయక చవితి రోజున గణపతిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి చవితి రోజు గణపతిని ఏ పూలతో పూజించాలి? ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? వీటి వల్ల చేకూరే ప్రయోజనాలు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్రటి పూలు: ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే వినాయకుడి అనుగ్రహం తొందరగా కలుగుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెప్పారు. ఎర్ర గులాబి, ఎర్ర మందారాలతో గణపతిని ఎక్కువగా పూజించాలని సూచించారు. గణపతికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఆయన అనుగ్రహం త్వరగా కలుగుతుందని వివరించారు.
పద్మం: గణపతిని వినాయక చవితి రోజు పద్మపుష్పాలతో పూజిస్తే ధన పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయట.
పారిజాత పువ్వు: ఈ పుష్పాన్ని వినాయక చవితి రోజు గణపతికి సమర్పిస్తే జాతకంలోని 12 రకాల కాల, సర్ప దోషాలు తొలగిపోతాయని తెలిపారు.
సంపంగి: ఈ పూలతో గణపతిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయట.
జాజి పూలు: జాజి పూలతో వియనాకుడిని పూజిస్తే ఉద్యోగ పరమైన సమస్యలు తొలగిపోయి.. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
మల్లెపూలు: మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి.. ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.
తెల్ల జిల్లెడు: ఈ పూలతో గణపతిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడమే కాకుండా జీవితంలో ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు.
ఏ నైవేద్యం పెడితే ఎలాంటి లాభాలుంటాయి..?
మోదకం: వినాయక చవితి రోజు మోదకం (లడ్డు, ఉండ్రాలు) సమర్పిస్తే.. జీవితంలోని కోరికలు త్వరగా నెరవేరుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెప్పారు.
అటుకులు: వినాయకుడికి నైవేద్యంగా అటుకులు సమర్పిస్తే.. సంసార జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందట.
పేలాలు: వినాయక చవితి రోజున పేలాలను నైవేద్యంగా సమర్పిస్తే మానసిక అశాంతి తొలగిపోయి.. ప్రశాంతత దొరకుతుందని వివరించారు.
సత్తుపిండి: వినాయకుడికి నైవేద్యంగా సత్తుపిండిని సమర్పిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి.. మనోధైర్యం వస్తుందని తెలిపారు.
చెరకు: చెరకు ముక్కలను గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోయి.. ప్రారభ్థ కర్మ ఫలితాల నుంచి బయట పడవచ్చని వివరించారు.
కొబ్బరి కురడి: దీనిని వినాయకుడికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.
నువ్వుల నైవేద్యం: నువ్వులతో చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయని వివరించారు.
పండ్లు: గణపతికి రకరకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగ, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుందని చెప్పారు.
అన్న ప్రసాదాలు గణపతికి ఇష్టమే..
వినాయకుడికి సమర్పించే అన్న ప్రసాదాలకు ప్రాధాన్యం ఉంటుంది. వినాయక చవితి రోజు బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనసులోని కోరికలు త్వరగా నెరవేరి సిరిసంపదలు వెల్లివిరిస్తాయని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు.
పులిహోర: వివాహ సమస్యలు ఉన్నవారు.. త్వరగా పెళ్లి నిశ్చయం కావాలని అనుకునేవారు పులిహోర నైవేద్యం సమర్పించాలని తెలిపారు.
పెరుగు అన్నం: వ్యాపార పరంగా పురోభివృద్ధి లభించి లాభాలతో ముందుకు సాగాలంటే పెరుగు అన్నం గణపతికి నైవేద్యంగా సమర్పించాలని సూచించారు.
పెసరపప్పు పొంగలి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా పెట్టాలని సూచించారు.
నువ్వుల అన్నం: పితృదోషాలు, శాపాలు తొలగిపోవాలంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని వివరించారు.
నెయ్యి అన్నం: అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే నెయ్యితో చేసిన అన్నాన్ని సమర్పించాలని సలహా ఇస్తున్నారు.
శనగపప్పు పాయసం: రాజయోగం ఉండి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు చాలా ఉన్నతంగా జీవించాలంటే శెనగపప్పు పాయసం చేసి గణపతికి సమర్పించాలని చెప్పారు.
కూరగాయల అన్నం: గణపతికి కూరగాయల అన్నం నివేదిస్తే అపమృత్యు దోషాలు లేకుండా ప్రయాణాలు విజయవంతం అవుతాయని వివరించారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.