Vayalpadu Pattabhi Rama Swamy Temple : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా 'వాయల్పాడు' క్షేత్రంలో వెలసిన పట్టాభి రామాలయం పురాతనమైన రామాలయంగా విరాజిల్లుతోంది.
సీతారాముల విభిన్న దర్శనం
సాధారణంగా రామాలయాలలో శ్రీరామచంద్రుడు కోదండాన్ని ధరించి, సీతా లక్ష్మణ సమేతుడై కనిపిస్తుంటాడు. దాదాపుగా అన్ని రామాలయాలలో పాదాల వద్ద నమస్కరిస్తున్న హనుమను ఆశీర్వదిస్తున్నట్టుగా దర్శనమిస్తుంటాడు. మరి కొన్ని క్షేత్రాల్లో పట్టాభిషేక చిత్రాన్ని గుర్తుకు తెస్తున్నట్టుగా స్వామి వారు సీతమ్మవారితో పాటు తన సోదరుల మూర్తులతో కలిసి దర్శనమిస్తుంటాడు. కానీ వాయల్పాడులో మాత్రం స్వామి వారు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంటాడు. ఏ రామాలయంలోనైనా స్వామివారికి ఎడమ వైపున అమ్మవారుంటారు. ఇక్కడ మాత్రం అమ్మవారు కుడివైపు ఉండటం ఈ క్షేత్రం విశిష్టత.
జాంబవంత ప్రతిష్ఠ రాముడు
వాయల్పాడు రామాలయంలోని శ్రీరాముని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. గర్భాలయంలో కొలువైన స్వామి వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఇక్కడి స్వామి వారు తిరుమల వేంకటేశ్వరస్వామి మాదిరిగా వైకుంఠ ముద్రను కలిగి ఉండటం విశేషం. ఈ ఆలయంలో రాముల వారు ఖడ్గాలు ధరించి ఉండటం చేత ప్రతాప రామచంద్రుడని అంటారు.
వాల్మీకి పురమే వాయల్పాడు
ఆలయ స్థల పురాణం ప్రకారం వాయల్పాడును గతంలో వాల్మీకిపురం అని పిలిచేవారు. జాంబవంతుడు ప్రతిష్టించి పూజించిన తర్వాత ఈ మూర్తులు మట్టిలో కప్పబడిపోయాయి. తిరిగి ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న వాల్మీకి మహర్షి వల్ల పుట్టలో నుంచి ఈ విగ్రహాలు తిరిగి బయటపడ్డాయి. వాల్మీకి కారణంగా విగ్రహాలు బయట పడ్డాయి కాబట్టి, ఇంకా ఇక్కడి కొండపై వాల్మీకి మహర్షి తపస్సు చేసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి వాల్మీకిపురం అనే పేరు కూడా వచ్చింది. కాలక్రమేణా అదే వాయల్పాడుగా మారింది.
కల్యాణ వైభోగమే!
వాయల్పాడు రామాలయంలో ప్రతి నెల సీతమ్మ వారి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున కన్నుల పండుగగా కళ్యాణం జరుగుతుంది. అప్పుడు అమ్మవారి అయ్యవారి సొగసు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు
ప్రతి ఏటా ఈ ఆలయంలో 9 రోజుల పాటు జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ తొమ్మిది రోజులు ఈ క్షేత్రంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. వాయల్పాడు క్షేత్రాన్ని ఎందరో మహర్షులు, మరెందరో మహోన్నతమైన వ్యక్తులు, మహా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.
అన్నమయ్య దర్శించిన వాయల్పాడు
వాయల్పాడు క్షేత్రంలో వెలసిన పట్టాభిరాముని ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని అనేకసార్లు సందర్శించడమే కాకుండా స్వామివారిని కీర్తిస్తూ కీర్తనలు కూడా రచించాడని తెలుస్తోంది.
సువిశాల సుందర ఆలయం
సువిశాలమైన ప్రదేశంలో, పచ్చని కొండల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో వెలసిన ప్రతాప రామచంద్రుని దర్శించడం మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనం వల్ల అనిర్వచనీయమైన భక్తి భావంతో మనసు పులకిస్తుంది.
పాపనాశనం క్షేత్రదర్శనం
వాయల్పాడు పట్టాభి రామాలయాన్ని సందర్శించడం వల్ల సమస్త పాపాలు పోయి సకల శుభాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. పుణ్య క్షేత్రాల సందర్శన వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల్లో నెలకొని ఉండే కంటికి కనిపించని అద్వితీయ శక్తుల వలన, చేసే పనుల్లో సానుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి ప్రాచీన ఆలయాలు మన దేశ సంపదలు. ఇలాంటి దేవాలయాలను తరచుగా దర్శిస్తూ వాటి గొప్పతనాన్ని ముందు తరాలకు తెలిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.