Vastu Tips to Improve Financially: "ధనం మూలం ఇదం జగత్" అని అంటారు పెద్దలు. ఏ పని కావాలన్నా డబ్బు కావాలి. అందుకే చాలా మంది ధనవంతులు కావాలని కలలు కంటారు. అందుకోసం కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు. అయితే.. కొందరు ఎంత కష్టపడినా ఆర్థికంగా స్థిరపడలేరు. దీనికి కారణం వాస్తు దోషం అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలాంటి వారు పర్సులో కొన్ని వస్తువులు ఉంచుకుంటే.. అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రావి చెట్టు ఆకులు: హిందూ సంప్రదాయంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎంతో మంది ఈ చెట్టుకు పూజలు చేస్తారు. ముడుపులు కడతారు. ఇంత పవిత్రమైన చెట్టు ఆకులను మీ పర్సులో ఉంచుకుంటే.. ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అంటున్నారు. వాలెట్ ఎప్పటికీ ఖాళీగా ఉండదని చెబుతున్నారు. అలాగే జీవితంలో విజయం వరిస్తుందని అంటున్నారు.
గోమతీ చక్రం: గోమతీ చక్రం చాలా పవిత్రమైనదని మనందరికీ తెలుసు. ఈ గోమతి చక్రాలు ఉన్న ఇల్లు కూడా ఆనందం, శ్రేయస్సుతో పొంగిపొర్లుతుందని పండితులు అంటున్నారు. ఈ చక్రాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. అలాగే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని చెబుతున్నారు. కాబట్టి మీరు మీ వాలెట్ నిండుగా ఉంచుకోవాలనుకుంటే పర్సులో గోమతీ చక్రాన్ని ఉంచుకోమని సలహా ఇస్తున్నారు.
పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా? - వాస్తు ప్రకారం మీకు ఆర్థిక కష్టాలు గ్యారెంటీ!
కమలం: తామరపువ్వులకి లక్ష్మీదేవితో ప్రత్యేక సంబంధం ఉంది. అందువల్ల మీ పర్సులో తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచగలిగితే.. ఇది చాలా శుభప్రదమని.. ఆర్థిక పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. అలాగే.. జీవితంలో విజయం వరిస్తుందని చెబుతున్నారు.
బియ్యం: ఆర్థిక సమస్యలు తీరిపోయి.. మీరు ధనవంతులు కావాలంటే మీ పర్సులో బియ్యం ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది మీ అదనపు ఖర్చులను తగ్గిస్తుందని.. సంపద పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.
బంగారు, వెండి నాణేలు: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా.. బంగారు, వెండి నాణేలు మీ పర్సులో ఉంచుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అందుకోసం మొదట బంగారు, వెండి నాణేలను లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి.. ఆ తర్వాత దానిని మీ పర్సులో పెట్టుకోవాలని అంటున్నారు. ఇది మీ వాలెట్‌ను ఎప్పటికీ ఖాళీగా ఉంచదని.. ఆర్థికంగా కూడా లాభపడుతారని అంటున్నారు.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.