Vastu Tips In Telugu : ఇంటి నిర్మాణంలో వాస్తును పాటించిన విధంగానే.. ఇంట్లోని వస్తువుల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుందని అంటున్నారు. దీని ప్రకారం.. మీ ఇంట్లో పరుగెత్తుతున్న ఏడు గుర్రాల ఫొటో ఒకటి ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి.. ఈ ఫొటో ఇంట్లో ఉండటం వల్ల కలిగే లాభాలు ఏంటి ? దీనిని ఏ దిశలో పెట్టాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
7తో అన్నీ ముడిపడి ఉన్నాయి!
ఇంట్లో ఏడు గుర్రాల ఫొటో పెట్టుకోవడం వల్ల ఇంటికి మరింత అందం పెరగడంతో పాటు వాస్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే హిందూ ధర్మాల ప్రకారం ఏడు అంకెను శుభప్రదంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ 7 అంకెకు ప్రాధాన్యం ఉందని నిపుణులంటున్నారు. ఎలా అంటే దంపతులు పెళ్లిలో ఏడడుగులు వేస్తారు. అలాగే ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సులో కూడా ఏడు రంగులుంటాయి. ఇంకా ఈ భూమిపై ఏడు మహాసముద్రాలున్నాయి. ఖండాలు కూడా ఏడే. సంగీతంలోనూ సప్త స్వరాలు ఉంటాయి. అలాగే సూర్య భగవానుడి రథంలో ఏడు గుర్రాలుంటాయని చెబుతారు. ఇలా 7 అంకెకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలోనే ఏడు గుర్రాలు పరుగెత్తే చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు.
ఏ దిశలో పెట్టాలి ?
ఇంట్లో దక్షిణం వైపు ఉన్న గోడపై ఏడు గుర్రాల బొమ్మను ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులంటున్నారు. అలాగే గుర్రాలు వేర్వేరు దిశల్లో వెళ్తున్నట్లు ఉండకుండా, అన్నీ ఒకే దిశలో వెళ్తున్నట్లు ఉండాలని చెబుతున్నారు. గుర్రాల ముఖం ఇంటి బయట వైపు, గుమ్మం వైపు ఉండకూడదు. అవి ఇంటి లోపలి వైపు చూసేలా ఉండాలి. అలాగే గుర్రాలు కోపంతో ఉన్నట్లు కాకుండా సంతోషకరంగా పరుగెడుతున్నట్లు ఉండాలి. దీనిని వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో పెట్టకూడదట. అక్కడ పెడితే భార్యభర్తల మధ్య కలహాలు, గొడవలు రగిలే అవకాశం ఉంటుందట. కాబట్టి హాల్ లో పెడితే మంచిదని సూచిస్తున్నారు.
అంతా మంచే జరుగుతుంది!
వాస్తు ప్రకారం ఏడు గుర్రాల బొమ్మను ఇంట్లో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయట. అలాగే.. ఇంట్లో లక్ష్మీదేవీ కృప ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంకా.. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని అంటున్నారు. ఈ చిత్రపటాన్ని ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల వృత్తిపరంగా విజయాలు మీ సొంతం అవుతాయని చెబుతున్నారు.
వాస్తు ప్రకారం మీ ఇంట్లో డస్ట్‌బిన్ సరైన దిశలో ఉందా? - లేదంటే ఆర్థిక కష్టాలు వస్తాయట!