Vastu Tips For Beeruva Placement In Telugu : ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, డబ్బు ఉన్నవారికే నేటి సమాజంలో విలువెక్కువ అని కొందరు అంటూ ఉంటారు. ఇది ఎంత నిజమో ఎంత అబద్దమో కానీ, ప్రతి మనిషికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ధనం మాత్రం అవసరాలకు అందీ అందనట్లుగా ఉంటుంది. మరికొంత మందికి సునాయాసంగా ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ ధనలక్ష్మి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే మనం నిత్యం డబ్బు దాచుకునే బీరువా ఉంచే విషయంలో జాగ్రత్త వహించాలి.
నైరుతిలో బీరువా పెట్టొచ్చా!
సాధారణంగా అందరూ నైరుతిలో బరువు ఉండాలని ఆ దిశలో బీరువా పెడుతుంటారు అయితే నైరుతిలో బీరువా పెట్టొచ్చు కానీ ఆ బీరువాలో లక్ష్మీదేవి చిహ్నాలైన డబ్బు, బంగారం వంటివి పెట్టరాదు. అలా పెడితే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి.
కుబేర స్థానంలోనే డబ్బు
ఇంటికి ఉత్తరం కుబేర స్థానం. ఈ స్థానంలో, నైరుతి దిక్కులో ఏర్పాటు చేసిన దాని కన్నా చిన్న బీరువాను ఉత్తర గోడకు ఆనించకుండా, వాయువ్యం ఖాళీ ఉంచి దక్షిణం వైపు చూసేలా బీరువాను ఉంచి అందులో డబ్బు, నగలు వంటివి పెడితే డబ్బులు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహంతో నగలు ఒకటి ఉన్నవాళ్లు పది చేయించుకునే స్థోమత కలుగుతుంది.
బట్టలు పెట్టే బీరువాలో నగలు పెడితే
చాలా మంది మహిళలకు బట్టల మధ్యలో, పట్టు చీరల మధ్యలో డబ్బులు దాచే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం తప్పు అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు, బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్రం ఏమి చెబుతోంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారం, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోను పెట్టకూడదు. మంచం అనేది భోగ స్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది.
బీరువాలపై ఇవి పెడితే దరిద్రమే!
డబ్బు, బంగారం ఉంచే బీరువాలపైన ప్రయాణాలకు వాడే సూట్కేసులు, పనికిరాని అట్టపెట్టెలు వంటి సరంజామా పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతిలో బట్టలు పెట్టే బీరువాపైన బరువులు ఉంచవచ్చు కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెబుతోంది.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
- " class="align-text-top noRightClick twitterSection" data="">