Varalakshmi Vratham Pooja Vidhanam : శ్రావణమాసం అనగానే మనందరికీ ప్రతిఇంట్లో చేసే వరలక్ష్మీ వ్రతాలు గుర్తుకొస్తుంటాయి. పెళ్లైన మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని ఎంతో నియమనిష్ఠలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. అయితే, పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున చాలా మంది ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్ట్ 16వ తేదీన ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోబోతున్నారు. వరలక్ష్మీ వ్రతానికి రెండు రోజుల ముందు నుంచే ఇంట్లో హడావుడి మొదలవుతుంది. అయితే, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజ చేసే సమయంలో కొన్ని బొమ్మలు పూజ గదిలో పెడితే.. లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు "మాచిరాజు కిరణ్ కుమార్" చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు వరలక్ష్మీ అమ్మవారికి రెండు వైపులా.. రెండు ఏనుగు బొమ్మలను పెట్టండి. ఇవి చిన్నగా ఉన్నా లేదా కొంచెం పెద్దగా ఉన్నా కూడా పరవాలేదు. ఏనుగు బొమ్మలు ఎందుకు పెట్టాలంటే.. అమ్మవారికి ఇవంటే ఎంతో ఇష్టం. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట కనక వర్షం కురిపిస్తుంది. అలాగే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఆవునెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేస్తే అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇంకా ఆవునెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. కొబ్బరికాయ, అరటి పండు ముక్కలు కలిపి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా చేస్తే వరలక్ష్మీ దేవి పరిపూర్ణంగా అనుగ్రహిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
వరలక్ష్మీ వ్రతం చేసుకునేటప్పుడు ఆడవాళ్లందరూ తోరం కట్టుకుంటారు. ఆ తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే మంచి జరుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే..
బథ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదమ్..
పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే..
అలాగే వరలక్ష్మీ వ్రతం పూర్తైన తర్వాత.. ఆడవళ్లు వాయినం ఇచ్చుకుంటారు. ముత్తైదువుకు వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి ఇస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఆ శ్లోకం ఏంటంటే..
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ..
ఇందిరా తారికావాభ్యామ్ ఇందిరాయే నమో నమః
ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వల్ల మీ ఇంటి వరలక్ష్మీ దేవి సిరుల వర్షం కురిపిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్విత 'చింతామణి' గణపతి క్షేత్రం- ఎక్కడ ఉందో తెలుసా? -
శ్రావణ శుక్రవారం స్పెషల్- కొల్హాపుర్ మహాలక్ష్మి టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా?