Varalakshmi Vratham Good Time 2024 : పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చేసే పూజలు, వ్రతాలు, నోములు ఈ మాసంలోనే ఉంటాయి. అయితే.. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అంటే ఆగస్టు 16వ తేదీన ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. మరి.. ఆ రోజున వ్రతం చేసుకోవడానికి శుభ ముహూర్తం ఎప్పుడుంది? వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా చేయాలి? అనే అంశాలపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
శుభ సమయం..
- సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుంచి, 8 గంటల 14 నిమిషాల వరకు ఉంది. వ్యవధి 2 గంటల 17 నిమిషాలు.
- వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుంచి, 3 గంటల 8 నిమిషాల వరకు ఉంది. వ్యవధి 2 గంటల 19 నిమిషాలు.
- కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటల 22 వరకు ఉంటుంది. వ్యవధి గంట 27 నిమిషాలు.
- వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి 11 గంటల 22 నిమిషాల నుంచి తెల్లవారు జాము ఒంటి గంట 18 నిమిషాల వరకు ఉంటుంది. వ్యవధి గంట 56 నిమిషాలు.
వరలక్ష్మీ వ్రతం రోజున పూజ ఇలా చేయండి :
వ్రతం చేసే మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి.. బంగారు వర్ణం, ఆకుపచ్చ, గులాబీ వంటి రంగులో ఉండే కొత్త చీర కట్టుకోండి. తర్వాత పూజ గదిలో వ్రతం చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి.. గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయండి. పూజ గదిలో ముగ్గులు వేయండి. ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణం, పూలతో అలంకరించుకోవాలి. ఇప్పుడు చెక్కపీటపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరిచి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి, గణపతిల విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని పెట్టండి.
అమ్మవారి విగ్రహం దగ్గర బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ఏర్పాటుచేసుకోండి. లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలకు పూలమాలలు వేసి అలంకరించండి. అలాగే నెయ్యితో దీపం వెలిగించండి. అగరబత్తిలను వెలిగించి ముందుగా గణపతి దేవుడికి పూజ చేయండి. పూలు, కొబ్బరికాయ, చందనం, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించండి.
ఇప్పుడు వరలక్ష్మీ పూజను ప్రారంభించండి. పూజ సమయంలో వరలక్ష్మీ వ్రత కథను చదవండి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠించండి. చివరికి హారతి ఇవ్వండి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు పులిహోర, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు వంటివి సమర్పించండి. ప్రసాదాలను ఇంటికి వచ్చిన వారందరికీ పంచండి. ముత్తైదువులకు పసుపు కుంకుమ శనగలతో తాంబూలం పెట్టి వాయినం ఇవ్వండి.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
వరలక్ష్మీ వ్రతం పూజ కోసం - మహిళలు ఏ రంగు చీర కట్టుకోవాలో మీకు తెలుసా?
పవిత్రమైన శ్రావణ మాసంలో - తులసి పూజ ఇలా చేయండి - డబ్బు సమస్యలు తప్పక దూరమవుతాయి!