Varahi Ammavari Navaratri Pooja : వారాహిదేవి లలితా పరాభట్టారిక సేనాని. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మ వారి ప్రసక్తి కనిపిస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహ మూర్తి. ఆ వరాహ మూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్నే వారాహి అంటారు.
వారాహి నవరాత్రులు ఎప్పుడు
వారాహి నవరాత్రులు జులై 6వ తేదీ నుంచి ప్రారంభమై జులై 15 వ తేదీ తో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకారంతోపూజించి ఆరాధిస్తారు. చివరలో జరిగే వారాహిదేవి ఊరేగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
నరఘోష - దృష్టిదోషాలు పోగొట్టే వారాహిదేవి
ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నపుడు అసూయపరుల దృష్టి దోషాలు తగలడం సహజం. అలాంటి దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు పిశాచ పీడా భయాందోళనలు వంటివి తొలగి పోవడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది.
కీర్తి - విజయాలనందించే వారాహి
వారాహిదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగుర వేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు.
వారాహి స్వరూపం
సప్త మాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మీ. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే ఎలాగైతే రోకలి ధాన్యం నించి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. దుక్కి దున్నడానికి, భూమిని పదును పెట్టడానికి నాగలిని వాడినట్లుగా వారాహి దేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్లేలా ప్రేరణ చేస్తుంది.
ఆషాఢంలో వారాహి ఆరాధన ప్రత్యేకం ఇందుకే!
ప్రాణ సంరక్షిణిగా ఆజ్ఞాచక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఓ విశేషముంది. వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢమాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుఖిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్ధన చేయడం జరుగుతుంది.
ఉగ్రం కాదు శాంతమూర్తి
వారాహిదేవి ఉగ్రంగా కనబడినప్పటికి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రు పీడలు ఉండవని భక్తుల విశ్వాసం.
శివుడికే క్షేత్ర పాలిక వారాహి
సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్ర పాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే అరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది.
బృహదీశ్వరునికి కూడా క్షేత్రపాలిక
కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు.
పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో జరుపుకుందాం అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం. ఓం శ్రీమాత్రే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.