Varaha Jayanti 2024 : బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం మహా ప్రళయం సంభవించి భూమి జలంలో మునిగిపోయింది. జగత్తుకు ఆధారమైన భూమండలాన్ని తిరిగి పైకి తేవడానికి బ్రహ్మదేవుడు పుండరీకాక్షుని స్మరించ సాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి లోకోద్ధరణకై ఉద్భవించాడు. సకల దేవతలు చూస్తుండగానే, క్షణం లోపల ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యములు కలిగించారు.
హిరణ్యాక్షుని సంహారం
అనంతరం వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీసి ఉద్దరించాడు. అనంతరం స్వామి తిరుమల కొండపై సంచరించినట్లుగా ఆధారాలున్నాయి. అందుకు నిదర్శనం తిరుమల కొండపై ఉన్న భూ వరాహ స్వామి ఆలయం. భాద్రపద శుద్ధ తదియ రోజు వరాహ జయంతి సందర్భంగా శ్రీమహావిష్ణువును వరాహ అవతారంలో పూజించిన వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం చేకూరుతాయని నమ్మకం.
వరాహ జయంతి ఎప్పుడు?
భాద్రపద శుద్ధ తదియ రోజు వరాహ జయంతిగా జరుపుకుంటాం. ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన వరాహ జయంతిని జరుపుకోనున్నాం. సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 12:21 నుంచి తదియ తిథి మొదలై సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 03:01కు ముగుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండుగలు సూర్యోదయంతో తిధి ఉన్న రోజునే జరుపుకోవడం ఆనవాయితీ కాబట్టి సెప్టెంబర్ 6వ తేదీనే వరాహ జయంతిని జరుపుకోవాలి.
వరాహ జయంతి ఇలా జరుపుకోవాలి?
వరాహ జయంతి రోజు వేకువజామునే నిద్రలేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని వరాహ స్వామి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. అనంతరం వరాహ స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. వరాహస్వామికి తెల్లని పుష్ప మాలికలు సమర్పించాలి. దద్దోజనం, చక్ర పొంగలి ప్రసాదంగా సమర్పించాలి. మంగళ హారతులు ఇవ్వాలి. పూజ చేసేవారు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
ఈ దానాలు శ్రేష్టం
ఈ రోజు రాగి కానీ ఇత్తడి చెంబులో కానీ గంగాజలాన్ని నింపి, అందులో అక్షింతలు, పువ్వులు వేసి మామిడి ఆకులతో అలంకరించి పైన కొబ్బరికాయ ఉంచి తయారుచేసిన కలశాన్ని బ్రాహ్మణుడికి దానం చేయడం వలన భూ లాభాన్ని, గృహ లాభాన్ని పొందుతారు. వరాహ జయంతి వ్రతాన్ని ఆచరించేవారు వరాహ జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం సమకూరుతుందని విశ్వాసం. రానున్న వరాహ జయంతిని మనం కూడా జరుపుకుందాం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.