Hanuman Jayanthi Celebration in Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వందల మంది కాలినడకన స్వామి వారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. భక్తుల కోరికలకు తగ్గట్టుగానే టీటీడీ నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది. తాజాగా.. హనుమాన్ జయంతి సందర్భంగా 5 రోజుల పాటు పలు ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
జూన్ 1 నుంచి 5వ తేదీ వరకూ అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ 5 రోజులు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయస్వామి, అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. అలాగే జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
ఐదు రోజులు హనుమాన్కు అభిషేకాలు: ఆకాశగంగలోని బాలాంజనేయస్వామి ఆలయంలో జూన్ ఒకటి నుంచి జూన్ 5 వరకూ ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1వ తేదీన మల్లెపూలతో, జూన్ 2వ తేదీన తమలపాకులతో, జూన్ 3వ తేదీన ఎర్రగన్నేరు, కనకాంబరాలతో, జూన్ 4వ తేదీన చామంతులతో, చివరి రోజైన జూన్ 5వ తేదీన సింధూరంతో అంజనాద్రి శ్రీ బాలాంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. అంతేకాకుండా.. శ్రీ ఆంజనేయ సహస్రనామార్చనలతోపాటు అత్యంత ఘనంగా మంత్రోచ్ఛారణల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు జరుపుతారని టీటీడీ ప్రకటనలో తెలిపింది.
జపాలీలో కార్యక్రమాలు: ఇక జపాలిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకూ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం జరగనుంది. జూన్ 1న హరికథ, జూన్ 2వ తేదీన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంకీర్తనలు, జూన్ 3న పురంధరదాస సంకీర్తనలు, జూన్ 4వ తేదీన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన, జూన్ 5న అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే హరికథ గానం నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల నృత్య కార్యక్రమాలు ఉంటాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతేకాకుండా.. హనుమాన్ జయంతి సందర్భంగా నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య శ్రీ హనుమాన్ జననంతో పాటు ఆంజనేయుడికి సంబంధించిన విషయాలపై ప్రముఖ వేద పండితులతో ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేసింది. కాబట్టి.. జూన్ నెలలో తిరుమల వెళ్లే భక్తులు స్వామి సేవలో తరించాలని టీటీడీ కోరింది.