Toli Ekadashi 2024 Telugu : ఆషాడ మాసంలోనే తెలుగు వారి ఆది పండుగ తొలి ఏకాదశి వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మనం తొలి ఏకాదశి పండుగను జరుపుకొంటాం. ఒక తెలుగు సామెత ప్రకారం తొలి ఏకాదశి నుంచి పండుగలు తీసుకుని వస్తాయంటారు. అంటే ఏకాదశి నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వ దినానికి హిందూ సంప్రదాయంలో విశేష స్థానముంది. ఈ నెల 17న తొలి ఏకాదశి పండుగ సందర్భంగా దాని విశిష్టత ఏమిటి? ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అన్ని ఏకాదశులు పవిత్రమే!
మనకు ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ నాటి నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయనైకాదశి అని కూడా అంటారు.
దేవతలకు రాత్రి సమయమే దక్షిణాయనం
తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని శాస్త్ర వచనం.
దక్షిణాయన పుణ్యకాలం అంటే!
మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తై ఇక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపునకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి.
తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఇలా పూజించాలి
తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. భారత భాగవత కధలు చదువుకుంటూ విష్ణు ఆలయ దర్శనం చేయాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ జాగారం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశి ఘడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వలన సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.
పితృదేవతల ప్రీతి కోసం పేలాల పిండి
ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.
పేలాల పిండిని ఇలా తయారు చేస్తారు
వేయించిన పేలాలు, బెల్లం, నెయ్యి , యాలకులు, శొంఠి కలిపి రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షా కాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృ దేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పంట పొలాల్లో కూడా
తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాలు పిండి చల్లుతారు. ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం. రానున్న తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొందాం. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులవుదాం.
జై శ్రీమన్నారాయణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
అప్పుల బాధలు పోయి సంపద పెరగాలా? శుక్రవారం ఈ పూజ చేస్తే చాలు! - Lakshmi Pooja Vidhanam Telugu
సర్వ విఘ్నాలు తొలగించే బల్లాలేశ్వర్ గణపతి! ఆ దివ్య క్షేత్రం ఎక్కడుందంటే? - Famous Ganapati Temple