Tirumala Special Darshan Tickets For May 2024 : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామి వారి సన్నిధిలో అడుగు పెట్టి, కళ్లతో దివ్యమైన స్వామి వారి రూపాన్ని చూసి తరించాలని ఎంతో మంది ఆశపడతారు. నిత్యం వేలాది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే, మే నెలలో తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి పలు రకాల ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ తేదీలను వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు: మే నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవాటికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు భక్తులకు అవకాశం ఇచ్చారు. కాగా, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లను మంజూరు చేశారు.
వర్చువల్ సేవ: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు.
శ్రీవాణి టికెట్లు: మే నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. అంతేకాకుండా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
స్పెషల్ దర్శనం టికెట్లు: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలలో మే నెలకు సంబంధించి గదులను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు.
శ్రీవారి సేవ కోటా : అలాగే శ్రీవారి సేవా టికెట్లను ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవా టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ముందే బుక్ చేసుకోండి: మేలో మీరు తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మే అంటే ఎండలు మండిపోతాయి. చిన్నారులు, వృద్ధులు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. సెలవు దినాల్లో భక్తులు కూడా భారీగా తరలివస్తారు. కాబట్టి, భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా స్వామివారి ఆర్జిత సేవలు, ఇంకా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ద్వారక ఎలా మునిగిపోయింది? శ్రీకృష్ణుడి నిర్యాణం కథేంటో తెలుసా?
కలియుగం అంటేనే దుష్టకాలం- కానీ ఈ సింపుల్ టిప్‌తో పుణ్యం మీ సొంతం!