Tirumala Brahmotsavam 2024 Date and Timings : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. అక్టోబరు 4 నుంచి 12 వరకు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందురోజు నిర్వహించే అంకురార్పణం కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే.. మీరు బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఏయే సేవలు ఎప్పుడు? శ్రీవారి వాహన సేవల టైమింగ్స్ ఏంటో మీకు తెలుసా? లేదు అంటే మాత్రం ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
శ్రీవారి వాహన సేవల వేళలు ఇలా..
- అక్టోబరు 4(శుక్రవారం) - ధ్వజారోహణం సాయంత్రం 5.45 నిమిషాల నుంచి 6 గంటల వరకు, పెద్దశేష వాహనం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు.
- అక్టోబరు 5(శనివారం) - చిన్నశేష వాహనం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, హంస వాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది.
- అక్టోబరు 6(ఆదివారం) - సింహవాహనం మార్నింగ్ 8 నుంచి 10 గంటల వరకు, ముత్యపు పందిరి వాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం.
- అక్టోబరు 7(సోమవారం) - కల్పవృక్షవాహనం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సర్వభూపాల వాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం.
- అక్టోబరు 8(మంగళవారం) - మోహిని అవతారం మార్నింగ్ 8 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం సాయంత్రం 6.30 నిమిషాల నుంచి రాత్రి 11.30 వరకు.
- అక్టోబరు 9(బుధవారం) - హనుమంత వాహనం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, గజవాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు, స్వర్ణ రథోత్సవం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు.
- అక్టోబరు 10(గురువారం) - సూర్యప్రభ వాహనం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు.
- అక్టోబరు 11(శుక్రవారం) - ఉదయం 7 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై శ్రీవారు విహరిస్తారు.
- అక్టోబరు 12(శనివారం) - బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఆదే రోజు రాత్రి 8.30 నుంచి 10.30 వరకు ధ్వజావరోహణం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.