Things Not To Do On Friday : హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సుఖాలను, భోగాలను ప్రసాదించే శుక్రుడు అధిపతి అయిన శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే శుక్రవారం ఏ పనులు చేసినా శుభకరమని విశ్వాసం. ముఖ్యంగా దారిద్య్రాన్ని పారదోలి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే శుక్రవారం ఏ పనులు చేయవచ్చు, ఏవి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం ఇల్లు కడుగుతున్నారా ?
శుక్రవారం ఇంటిని కడగరాదు. అలా చేసినట్లయితే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అందుకే చాలామంది లక్ష్మీ వారంగా పిలిచే గురువారం రోజునే ఇల్లూవాకిళ్లు కడుక్కొంటారు. సాధారణంగా గురువారం సాయంత్రమే లక్ష్మీ దేవి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఉంటుందో ఆ ఇంటికే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అందుకే గురువారం సాయంత్రమే ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.
శుక్రవారం మహిళలు తలస్నానం చేయొచ్చా?
శుక్రవారం మహిళలు తలస్నానం చేయరాదని శాస్త్రం చెబుతోంది. మహిళలు గురువారం, బుధవారం, ఆదివారం మాత్రమే తల స్నానం చేయాలి. శుక్రవారం మహిళలు తలస్నానం చేస్తే లక్ష్మీదేవి అలిగి ఇంటిని విడిచి వెళ్లిపోతుందంట!
శుక్రవారం ఇవి ఎవరికైనా ఇచ్చారో, దారిద్య్రానికి స్వాగతం చెప్పినట్లే!
శుక్రవారం ఉప్పు, పంచదార, పెరుగు, జీలకర్ర, పచ్చకర్పూరం, యాలకులు వంటి పదార్థాలు, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఎవరికీ ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంట్లోని సిరి అవతలి వారి ఇంటికి వెళ్లిపోతుంది. ఒకవేళ తప్పనిసరిగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వారి నుంచి కొంత డబ్బును తీసుకొని ఇవ్వవచ్చు.
శుక్రవారం రోజు ఇవి తింటే పేదరికం తప్పదు!
శుక్రవారం మద్యమాంసాలు తీసుకుంటే పేదరికం తప్పదని పండితులు హెచ్చరిస్తున్నారు.
శుభాలనిచ్చే శుక్రవారం నాడు గోళ్లు కత్తిరించరాదు. పేలు దువ్వుకోరాదు. తలకు ఆముదం వంటి నూనెలు పెట్టుకోరాదు. మహిళలు గడపలో నిలబడి తల దువ్వుకోకూడదు.
శుక్రవారం శుభాలనిచ్చేవి ఇవే!
- శుక్రవారం ఇంటి గడపను పసుపుకుంకుమలతో అలకరించాలి.
- ఇల్లంతా సుగంధం వ్యాపించి నరఘోష పోయేలా సాంబ్రాణి ధూపం వేయాలి.
- మహిళలు పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవాలి.
- శ్రీమహాలక్ష్మి స్వరూపమైన ఉప్పు, పచ్చ కర్పూరం, జీలకర్ర వంటి వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవాలి.
- గోమాతను పూజించాలి.
- తులసి పూజ చేయాలి.
- నూతన వాహనములు కొనాలనుకునే వారు శుక్రవారం నాడు ఇంటికి తెచ్చుకుంటే మంచిది.
- బంగారం, వెండి, వజ్రవైడూర్యాలు శుక్రవారం కొంటే ఎంతో మంచిది.
- ధాన్యం కొంటే ఇంటికి ధాన్యలక్ష్మీ వచ్చినట్లే!
- నూతన గృహాలు, పొలాలు, స్థలాలు కొనాలనుకునే వారు శుక్రవారం కొంటే మంచిది.
శుక్రవారం చేయాల్సిన మరి కొన్ని మంచి పనులను గురించి వచ్చే వారం తెలుసుకుందాం. సకల శుభమస్తు.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.