Why We Offer Hair In Tirupati : పూర్వం భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో తెలుసుకోడానికి ముల్లోకాలు వెళ్లాడు. మహర్షి వైకుంఠానికి వెళ్లేసరికి పాలకడలిలో శేషతల్పంపై శయనించి శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో నిలుపుకుని వైభోగంగా ఉన్న శ్రీ మహా విష్ణువును చూసి అసూయ కలిగింది. ఆ అసూయతో మహర్షి శ్రీనివాసుని వక్షస్థలంపై తన కాలితో తన్నాడు.
వైకుంఠం వీడిన శ్రీ మహాలక్ష్మి
తన నివాస స్థానాన్ని కాలితో తన్నినందుకు శ్రీ మహాలక్ష్మి ఆగ్రహించి వైకుంఠం విడిచి కొల్హాపూర్‌కు వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ వేంకటేశ్వరుని రూపంలో భూలోకానికి చేరుకొని ఒక పుట్టలో నివాసం ఏర్పరుచుకొని తపస్సు చేసుకుంటూ ఉండసాగాడు. ప్రతిరోజూ వేంకటేశ్వరుని ఆకలి తీర్చడానికి ఒక గోవు అక్కడకు వచ్చి తన శిరముల నుంచి పాలధారలను కార్చ సాగింది. ఆవు పాలన్నీ ఏమవుతున్నాయో తెలియక ఆందోళన పడుతున్న గొల్లవాడు, పుట్టలోని శ్రీనివాసుడు పాలు తాగుతున్నాడని ఆగ్రహించాడు. అక్కడ ఉన్నది సాక్షాత్తూ భగవంతుడని తెలుసుకోలేక అజ్ఞానంతో గొడ్డలితో శ్రీనివాసుని తలపై గాయపరుస్తాడు.
గాయపడిన శ్రీనివాసునికి భక్తురాలి పరిచర్యలు
గొల్లవాని గొడ్డలి పెట్టుకు నుదుట గాయమైన శ్రీనివాసునికి నీలా అనే భక్తురాలు ఎదురుపడి నుదుటి మీద గాయానికి ఆకు పసరు పూసి పరిచర్యలు చేస్తుంది. అనంతరం గాయపడిన ప్రదేశంలో తొలగిపోయిన వెంట్రుకల స్థానంలో తన తల వెంట్రుకలను తీసి శ్రీనివాసునికి అమర్చి కట్టు కడుతుంది నీలా.
భక్తురాలికి భగవంతుని వరం
నీలా భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తాను తిరుమలలో వెలసిన తరువాత తన దర్శనానికి విచ్చేసిన భక్తులు తన మీద భక్తితో ఇచ్చిన తలనీలాలన్నీ నీలాకు చెందేలా వరమిస్తాడు. అంతేకాకుండా కలియుగాంతం వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని నీలకు వెంట్రుకలు తొలగించిన స్థానంలో తిరిగి వెంట్రుకలు వచ్చి చేరుతూనే ఉంటాయని అభయమిస్తాడు ఆ కలియుగ శ్రీనివాసుడు.
నేటికీ నిరంతరాయంగా తలనీలాల సమర్పణ
ఆనాటి నుంచి నేటి వరకు తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో కొండకు దర్శనానికి వెళ్లే వారిలో దాదాపు సగం మందికి పైగానే స్వామికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.
కళ్యాణం కమనీయం కల్యాణకట్ట
తిరుమలలో దేవునికి భక్తులు తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని కల్యాణకట్ట అని అంటారు. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం క్షురకర్మ అంటే క్షవరం అన్ని వేళలా చేయించుకోవడం నిషిద్ధం. ప్రత్యేకించి మంగళవారం, శుక్రవారం, శనివారం క్షవరం చేయించుకోకూడదు. అలాగే సూర్యోదయం తర్వాత, మధ్యాహ్నం సమయాల్లో కూడా క్షవరం చేయించుకోకూడదు. కానీ తిరుమల శ్రీనివాసుని సన్నిధి నిత్యకల్యాణం పచ్చతోరణం. అందుకే ఇక్కడ అలాంటి నియమాలు ఏవీ ఉండవు. అందుకే దాని పేరు కల్యాణకట్ట అయింది.
365 రోజులు 24 గంటలు
కళ్యాణ కట్టలో ఇరవై నాలుగు గంటల పాటు భక్తులు తలనీలాలు సమర్పించే శుభకార్యం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. పేద, ధనిక అనే బేధం లేకుండా నిత్యం ఏడు కొండలపై తలనీలాలు సమర్పించే భక్తులతో కళ్యాణ కట్ట కిటకిట లాడుతూ ఉంటాయి.
పాపాలు ధ్వంసం
శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించడం వెనుక ఉన్న కథను తెలుసుకొని శ్రీనివాసునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తే మన పాపాలన్నీ పటాపంచలై పోతాయి.
ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.