Srivari Gaja Vahana Seva : అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీ మలయప్పస్వామి గజ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ దర్శనమీయనున్నారు. ఈ సందర్భంగా గజ వాహన సేవ విశిష్టతను తెలుసుకుందాం.
గజ వాహన సేవ విశిష్టత
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 9వ తేదీ బుధవారం సాయంత్రం గజ వాహనంపై శ్రీనివాసుడు తిరుమాడ వీధులలో ఊరేగనున్నారు. భాగవత అంతర్భాగమైన గజేంద్రమోక్షం ఘట్టంలో ఆ శ్రీహరి ఏనుగును కాపాడిన విధంగా, శరణు కోరే వారిని తాను సదా కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని శాస్త్ర వచనం.
ఐశ్వర్య ప్రాప్తి
గజవాహనంపై విహరించే శ్రీనివాసుని దర్శిస్తే కొండంత సమస్య కూడా దూది పింజలా తేలిపోతుందని పెద్దలు అంటారు. అంతేకాదు ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే శ్రీనివాసుని దర్శనంతో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
గజవాహనంపై విహరించే శ్రీనివాసునికి నమస్కరిస్తూ - ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీనిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.