Sri Adi Shankaracharya Jayanti 2024 : ఆపదలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడటానికి 'దైవం మానుష రూపేణా' అన్నట్లు అవతరించిన ఆదిశంకరులు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే! ఆ శివుడే శంకరుల రూపంలో మన మధ్య కదలాడి హిందూ ధర్మాన్ని ఉద్ధరించారు. జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.
ఆదిభిక్షువుగా శంకరులు
ఆదిశంకరులు కేరళలోని కాలడిలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆర్యాంబకు జన్మించారు. శంకరులు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఐదు సంవత్సరాల చిరుప్రాయంలోనే తల్లి ఆర్యాంబ శంకరులకు ఉపనయనం జరిపించింది. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా ఆనాటి నుంచే శంకరుల ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోయింది. ఉపనయనం అయ్యాక ఆది భిక్షువుగా శంకరులు భిక్షాటన చేస్తూ ఓ పేదరాలి ఇంటికి వెళ్లి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించి, ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి కనకధారా స్తోత్రం చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె దారిద్య్రాన్ని పోగొట్టారు.
నదినే దారి మళ్లించిన మహనీయుడు
శంకరులు తన తల్లి వృద్ధాప్యంతో నదికి వెళ్లలేని పరిస్థితుల్లో గంగాస్తవం జపించి ఆమె కోసం ఆ నదిని దారి మళ్లించి తన ఇంటి ముందు నుంచే ప్రవహించేలా చేసిన మహనీయుడు.
సన్యాసాశ్రమ దీక్ష
శంకరులు ఐహిక సుఖాలపై వ్యామోహం లేక సన్యాసం స్వీకరించి దలచి తల్లి అనుమతి కోరగా ఆమె ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క కుమారుడు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది కదా. కానీ శంకరులు తాను ఒక మొసలి చేత చిక్కబడి ఉన్నట్లు తల్లి తన సన్యాసం దీక్షకు ఒప్పుకుంటేనే మొసలి విడిచి పెడుతుందని చెప్పి తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరిస్తాడు.
సద్గురు అన్వేషణ
సన్యసించిన తర్వాత శంకరులు తన గురువును వెతుక్కుంటూ బయలుదేరి గోవింద భగవత్పాదులను చేరుకున్నారు. శంకరుని చూసిన వెంటనే గోవింద భగవత్పాదులు 'శంకరశ్శంకర సాక్షాత్' అంటే ఆ శివుడే ఈ శంకరాచార్యులు అని గ్రహించి తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా అందించారు. అంతటి గొప్ప శంకరులు కూడా విజ్ఞానం కోసం గురువును ఆశ్రయించారంటే గురువు ఎంత గొప్పవాడో కదా.
ఆసేతు హిమాచలం పాదయాత్ర
భగవత్పాదులు వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక శంకరులు ఆసేతు హిమాచలం కాలినడకన పర్యటించి హిందూ ధర్మ వ్యాప్తి చేసారు. వారణాసి, బదరి వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ప్రస్థానత్రయంగా పేర్కొనే బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు చక్కని భాష్యం అందించారు.
నేత్రాగ్నితో తల్లికి దహన సంస్కారాలు
శంకరులు తన తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు ఆమె కిచ్చిన మాట ప్రకారం అంతిమ సంస్కారాలు చేయడానికి వస్తాడు. కానీ సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుంచి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజింప జేస్తారు.
హిందూ ధర్మానికి మూల స్తంభాలు
శంకరులు తన హిందూ ధర్మ పరిరక్షణ ప్రస్థానంలో భాగంగా మూకాంబిక, తిరుమల, పూరీ, కంచి, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్వితంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాలు శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలు దిక్కులా దీపస్తంభాల మాదిరిగా పనిచేశాయి.
అద్వైత సిద్ధాంతం ప్రభోదం
శంకరులు హిందూ మతానికి చెందిన అన్ని శాఖలు, పీఠాలు ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు పండితులు, విమర్శకులను ఒప్పించి దేశవ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు.
చివరి యాత్ర శివైక్యం
శంకరులు తన చివరి యాత్రలో భాగంగా బదరికి క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదేశాల మేరకు అలకనంద నదిలో ఉన్న శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని బదరి క్షేత్రంలో ప్రతిష్టించి, బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి తాను వచ్చిన పని పూర్తయింది అన్న నమ్మకంతో 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే శివైక్యం అయ్యారు. కేవలం 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యసామాన్యం.
శంకరులు రచించిన కొన్ని స్తోత్రాలు
- విఘ్నాలు పోగొట్టే మహా గణేశ పంచరత్న స్తోత్రం
- ఆర్థిక బాధలు పోగొట్టే కనకధారా స్తోత్రం
- జ్ఞానం కోసం వివేకచూడామణి
- ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి స్తోత్రం భజ గోవిందం
- లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం
- శివానందలహరి
- సౌందర్యలహరి
ఇలా ఒకటేమిటి మన ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారాన్ని చూపే శంకరులు రచించిన స్తోత్రాలు పండితుల నుంచి పామరుల వరకు ఎవరైనా తేలికగా చదువుకొని అర్థం చేసుకునే రీతిలో ఉంటాయి. ఈ శంకర జయంతి రోజున ఆ శంకరులను తలచుకొని మనమందరం శంకరులు చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన గురుదక్షిణ.
గురు స్మరణం
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వెంకన్నకు తలనీలాలు ఇస్తే గండాలు పోతాయా? అసలు ఎందుకు ఇస్తారో తెలుసా? - why we offer hair in tirupati