Sirichelma Temple : సిరిచెల్మ గ్రామంలోని శివాలయంలో శివుడు పార్వతీ సమేతంగా ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా స్వామి ఈ గ్రామంలో ప్రత్యక్షంగా తిరుగాడటం కూడా జరిగిందని స్థానికులు చెబుతుంటారు.
ఆలయ స్థలపురాణం
సిరిచెల్మ అనే గ్రామం ఉన్న ప్రాంతంలో పిట్టయ్య, నుమ్మవ్వ అనే దంపతులు ఉండేవారు. సంతానం లేని ఆ దంపతులు ఆ గ్రామానికి పశువుల కాపరిగా వచ్చిన ఓ బాలుడు అనాధ అని తెలుసుకుని అతడికి మల్లన్న అని పేరు పెట్టి పెంచుతారు. మల్లన్న వయసులో చిన్నవాడైనా సాయంలో మిన్న. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడు సాయం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్న ఆ బాలుడంటే అందరికి ఇష్టమే! ఒక సారి ఆ గ్రామంలో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. ప్రజలకు తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో మల్లన్న తాను ఒక రోజు లోపల చెరువును తవ్వడమే కాకుండా వర్షాన్ని కూడా కురిపిస్తానని గ్రామ ప్రజలతో చెబుతాడు. అంతేకాకుండా చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు.
అయితే ఒక రోజు లోపల చెరువును తవ్వడం సాధ్యం కాదని చెబుతూ ఎవరూ మల్లన్నకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అయినా తగ్గకుండా మల్లన్న చెరువు తవ్వడంలో నిమగ్నమవుతాడు. అర్ధరాత్రి దాటినా మల్లన్న చెరువు తవ్వడం మాత్రం మానలేదు. ఇక మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు ఆ చెరువు దగ్గరకు వచ్చి చూసేసరికి చెరువు తవ్వడం పూర్తి అయి ఉంటుంది కానీ ఆ బాలుడు మాత్రం అక్కడ కనిపించడు.
చెరువు మధ్యలో సాక్షాత్కరించిన శివలింగం
అదే సమయంలో చెరువు మధ్య భాగంలో ఒక శివలింగం కూడా ఉంటుంది. అంతేకాకుండా శివలింగం పై భాగంలో కొంత లోనికి వెళ్లినట్లు కనిపిస్తుంది. దీంతో ఆ బాలుడు ఎవరో కాదు శివుడే అని నమ్ముతారు. అంతేకాకుండా ఆ శివుడు తాను గ్రామాన్ని విడిచి పెట్టి పోతూ తన ప్రతి రూపమైన శివలింగాన్ని ఇక్కడ వదిలి వెళ్లాడని భావిస్తారు. అంతేకాకుండా రాత్రి మొత్తం ఆ బాలుడు మట్టి తట్టలను మోయడం వల్ల ఇలా గుంట ఏర్పడి ఉంటుందని కూడా స్థానికులు భావించారు.
శివుడు స్వప్న దర్శనం
ఆ సంఘటన జరిగిన రోజు రాత్రి పిట్టయ్య దంపతుల కలలో మల్లన్న కనిపించి తనకు అక్కడ ఓ దేవాలయం నిర్మించాల్సిందిగా సూచిస్తాడు. అదే మల్లికార్జున దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రంలో రెండు నందులు ఉంటాయి. ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో పార్వతీ సమేతంగా శివుడు ఇక్కడకు వస్తాడని చెబుతారు. శివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి స్థానికులే కాకుండా చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
అద్భుతమైన శిల్ప సంపద
శివుడే ప్రత్యక్షంగా తమ గ్రామంలో నడయాడి తమ కష్టాలను తీర్చాడని ఆ గ్రామస్థుల విశ్వాసం. అందుకు కృతజ్ఞతగా స్వామికి ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యాలను గ్రామస్థులు సమర్పిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పకళా సంపదను చూడవచ్చు. ఇందులో హిందూ ధర్మానికి చెందిన శిల్పాలతో పాటు జైన, బౌద్ధ, శిల్పాలను కూడా మనం చూడవచ్చు. ఎందరో రాజులు ఈ క్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారని చరిత్రకారుల అభిప్రాయం.
కనువిందు చేసే జలపాతాలు
ఈ దేవాలయానికి సమీపంలో కనువిందు చేసే జలపాతాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి 38 కిలోమీటర్ల దూరంలో తెలంగాణాలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అందమైన జలపాతంగా పేరుగాంచిన కుంతల జలపాతం ఉంటుంది. ఈ జలపాతానికి చూడటానికి ఎంతో మంది పర్యటకులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బస్సులో వెళ్తే, ఆదిలాబాద్ నుంచి సుమారు 47 కిలోమీటర్ల దూరంలో సిరిచెల్మ ఉంటుంది. ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.