Rakhi Festival Date and Timings: సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండగగా.. రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. మరి ఈ సంవత్సరం రాఖీ పండగ ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో రాఖీ కట్టకూడదు? ఏ సమయంలో కడితే మంచి ఫలితాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రాఖీ ఎప్పుడు: తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 19, 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నారు. ఆగస్టు 19వ తేదీ సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమయ్యి.. అదే రోజు రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం, భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదంటే: పురాణాల ప్రకారం, సూర్య దేవుని కుమార్తె భద్ర.. పుట్టుకతోనే ప్రపంచాన్ని మింగాలనే ఆలోచనతో జన్మించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం, భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు, కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని అంటున్నారు.
మీ సోదరుడి కోసం మీరే స్వయంగా రాఖీ తయారు చేయండి - మీ గుర్తుగా భద్రంగా దాచుకుంటారు!
భద్రకాలం ఎప్పటి వరకు ఉంది: భద్ర కాలం సమయం 2024 ఆగస్టు 19 సోమవారం నాడు సూర్యోదయాన 5:53 గంటలకు ప్రారంభమయ్యి.. మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుందని కిరణ్ కుమార్ చెబుతున్నారు. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండగను జరుపుకోవాలని సూచిస్తున్నారు.
రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు: ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:33 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు. అందులోనూ రెండు ప్రత్యేకమైన ముహూర్తాలలో కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని.. సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ అంటున్నారు. అవి..
- అపరాహ్న రాఖీ బంధన ముహూర్తం: మధ్యాహ్నం 1:43 గంటల నుంచి సాయంత్రం 4:20గంటల వరకు.
- ప్రదోష కాల సమయం: సాయంత్రం 6:56 గంటల నుంచి రాత్రి 9:08 గంటల మధ్య సమయంలో రాఖీ కట్టుకోవచ్చు.
రాఖీ కట్టేటప్పుడు ధరించాల్సిన రంగు: రాఖీ కట్టేటప్పుడు, కట్టించుకునేటప్పుడు.. ఆ సమయంలో తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని.. దీనివల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.
రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం:
శ్లోకం: యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్ష మాచల మాచల
ఈ శ్లోకం చదువుతూ రాఖీ కట్టడం వల్ల ఏడాదంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు.