Pray Dakshinamurthy On Thursday : వారంలో ఐదో రోజైన గురువారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రత్యేకంగా గురువు ఆరాధన కోసమే నిర్దేశించింది గురువారం. దేవగురువైన బృహస్పతి అధిపతిగా ఉన్న గురువారం ఎంతో విశిష్టమైనది. శుభ కార్యక్రమాలు ముఖ్యంగా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణిస్తారు. మరి ఈ గురువారం చేయాల్సిన దక్షిణామూర్తి ఆరాధన గురించి తెలుసుకుందాం.
మౌనమే శరణ్యం
పరమశివుని జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపమని శివపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. సకల విద్యలకు ఆది గురువైన దక్షిణామూర్తి తన శిష్యులకు మౌనంగానే బోధనలు చేస్తాడంట! అందుకే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వానాం అంటారు. అందుకే కదా మౌనాన్ని మించిన భాష లేదని పెద్దలు అంటారు. వంద మాటలు చెప్పలేని మాట ఒక్క మౌనంతోనే వెల్లడించవచ్చని గురువులు అంటారు. అందుకే జ్ఞానం కోరుకునేవారు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తారు.
దక్షిణామూర్తి అని ఎందుకు అంటారు
దక్షిణామూర్తి అంటే సంస్కృతంలో దక్షిణ ముఖంగా వెలసిన స్వామి అని ఒక అర్ధం. అయితే మరో అర్ధం ప్రకారం దాక్షిణ్యం అంటే అపారమైన కరుణను తన భక్తులపై ప్రసరింప చేసేవాడు అని అర్ధం. అందుకే ఏ ఆలయంలో చూసినా దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగానే ఉంటాడు.
జ్ఞానప్రదాత దక్షిణామూర్తి స్వరూపం
పరమశివుని అంశగా వెలసిన జ్ఞాన దక్షిణామూర్తి నాలుగు చేతులతో ఓ మర్రిచెట్టు కింద కూర్చున్నట్లుగా ఉంటుంది. జింక చర్మం ఆసనంగా కలిగి ఉన్న దక్షిణామూర్తి చుట్టూ మునులు, రుషులు కూర్చొని జ్ఞానాన్ని పొందుతుంటారు. దక్షిణామూర్తి స్వామి పాదాల కింద అజ్ఞానమనే రాక్షసుడు అణిచివేసి ఉంటాడు. దీని అర్ధం ఏమిటంటే దక్షిణామూర్తిని నిర్మలమైన మనసుతో ఆశ్రయిస్తే మన అజ్ఞానం పటాపంచలై పోతుంది.
చిన్ముద్ర ఆనందమూర్తి
స్వామి చిన్ముద్రను గమనిస్తే బొటనవేలు భగవంతుడిని, చూపుడు వేలు మనిషికి ప్రతీకలుగా ఉంటే, మిగిలిన మూడు వేళ్లు గత జన్మ నుంచి మనిషికి పుట్టుకతో వచ్చే అహంకారం, భ్రమ, చెడు పనులు అనే వాటిని సూచిస్తాయి. జ్ఞానం కోరి దక్షిణామూర్తిని ఆశ్రయించిన వారికి పూర్వ జన్మల కర్మ ఫలంగా వచ్చిన చెడు వాసనలు పోయి, ఆత్మజ్ఞానం లభించి జన్మ రాహిత్యుడు అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దక్షిణామూర్తికి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి
ప్రతి శివాలయంలో దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించిన దక్షిణామూర్తి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు ఏకైక దక్షిణమూర్తి జ్యోతిర్లింగంగా విరాజిల్లుతున్నాడు.
దక్షిణామూర్తిని ఏ రోజు పూజించాలి?
విద్యార్థులు చదువు కోసం, జ్ఞానార్థులు జ్ఞానం కోసం, మోక్షార్ధులు మోక్షం కోసం అంతేకాకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, అపమృత్యు దోషాలను పోగొట్టుకోవడం కోసం తప్పనిసరిగా శ్రీ దక్షిణామూర్తిని ఆశ్రయించాల్సిందే! ప్రతి గురువారం అన్ని ఆలయాల్లో దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి. మనం కూడా ఈ గురువారం దక్షిణామూర్తిని ధ్యానిద్దాం. అపారమైన జ్ఞానాన్ని పొందుదాం.
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
ముఖ్యగమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.