Dussehra Navratri Annapurna Devi Avataram : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు మూడో రోజు ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు? ఏ శ్లోకం చదువుకోవాలి? ఏ రంగు వస్త్రాన్ని, ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం
శరన్నవరాత్రులలో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు.
అన్నపూర్ణాదేవి అవతార ప్రాశస్త్యం
ప్రతి జీవికి జీవనాధారం ఆహారం. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మానవాళికి అలాంటి అన్నాన్ని అందించేది అన్నపూర్ణాదేవి. శరన్నవరాత్రులలో ఈ తల్లిని పూజిస్తే అన్నానికి లోటుండదు.
శ్లోకం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
అని ఆర్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే చాలు. ఆమె బిడ్డలమైన మనందరికీ జీవితాంతం అన్నానికి లోటు లేకుండా కాపాడుతుంది శ్రీ అన్నపూర్ణాదేవి. లోకంలో అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. అందువల్ల ఈ రోజు అన్నదానం చేస్తే, ఎంతో పుణ్యం లభిస్తుంది. శుభాలు కలుగుతాయి.
ఏ రంగు వస్త్రం? ఏ పూలు?
ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. తెల్ల చామంతులతో అమ్మను పూజించాలి.
ప్రసాదం
అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు అల్లం గారెలు సమర్పించాలి. శ్రీ అన్నపూర్ణాదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక!
ఓం శ్రీమాత్రే నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.