Nirjala Ekadashi Vratam : తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి 17వ తేదీ తెల్లవారుఝామున 4:47 నిమిషాలకు ప్రారంభమై 18వ తేదీ ఉదయం 6:24 వరకు కొనసాగుతుంది. జూన్ 18వ తేదీన నిర్జల ఏకాదశిని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
నిర్జల ఏకాదశి- పౌరాణిక గాథ
నిర్జల ఏకాదశి వెనుక ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. పాండవులలో రెండవ వాడైన భీమునికి ఆకలెక్కువ. ఒక్కపూట కూడా భోజనం చేయకుండా ఉండలేని భోజన ప్రియుడు భీముడు. ఒకసారి వ్యాసమహర్షితో భీముడు తన తల్లి, సోదరులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారని తాను నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండలేనని, మోక్షాన్ని పొందటానికి సంవత్సరంలో ఒక్కరోజు చేసే ఉపవాసం అయితే చేయగలనని అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడతాడు. అప్పుడు వ్యాసుడు జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆహారం మాత్రమే కాకుండా కనీసం జలం కూడా తీసుకోకుండా నిష్టగా ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు విరివిగా చేస్తే మోక్షం లభిస్తుందని చెబుతాడు.
భీముని ఏకాదశి
వ్యాసుని సలహా మేరకు భీముడు నీరు అంటే జలం కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, ఇతర దానాలు చేసి సంతుష్టి పరచి మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని, భీముని ఏకాదశి అని పాండవ ఏకాదశి అని అంటారు.
నిర్జల ఏకాదశి రోజు ఎవరిని పూజించాలి?
అక్షయ తృతీయ కంటే పవిత్రమైనదిగా భావించే నిర్జల ఏకాదశి రోజు నిష్టతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పొడవునా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారికి కూడా సంవత్సరమంతా పూజ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసి లక్ష్మీనారాయణుల విగ్రహం కానీ చిత్ర పటం కానీ ఉంచుకొని పూజ ప్రారంభించాలి.
ముందుగా లక్ష్మీనారాయణులకు గంధం, కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. లక్ష్మీనారాయణలకు భక్తి పూర్వకంగా నమస్కరించాలి. విష్ణుపూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి. తులసి లేకుంటే పూజ అసంపూర్ణం అవుతుంది. 108 సార్లు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి. ఆ రోజంతా నీరు కూడా తాగకుండా పూర్తిగా ఉపవాసం ఉండాలి.
ఈ నైవేద్యాలు ప్రీతికరం
లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన పరమాన్నం ఈ రోజు తప్పనిసరిగా నివేదించాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పంజరి ప్రసాదాన్ని నివేదిస్తారు. ఫూల్ మఖానా, ధనియాలు విడి విడిగా వేయించి నెయ్యి, బెల్లం, యాలకులు వంటివి కలిపి పొడి లాగా తయారు చేసే ప్రసాదమే పంజరి. ఈ ప్రసాదం నారాయణునికి ప్రీతికరమైనది.
నిర్జల ఏకాదశి వ్రత నియమాలు
నిర్జల ఏకాదశి వ్రతం చేసే వారు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేయాలి. ఎలాంటి ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా భగవన్నామ స్మరణం చేస్తూ కాలక్షేపం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి.
నిర్జల ఏకాదశి వ్రత ఫలం
- నిర్జల ఏకాదశి చాలా పవిత్రమైన రోజు కావటం వల్ల ఈ రోజు చేసే పూజలకు తప్పక ఫలితం వస్తుంది.
- నిర్జల ఏకాదశి రోజున నీరు, ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు.
- నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కీర్తి, గౌరవం, ఆనందం, శ్రేయస్సు పొందుతారని విశ్వాసం.
- నిర్జల ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో చేసిన వారు మోక్షాన్ని పొందుతారని శాస్త్ర వచనం.
నిర్జల ఏకాదశి రోజు చేయాల్సిన దానాలు!
- జాతక దోషాలను తొలగించుకోడానికి నిర్జల ఏకాదశి రోజు నీరు, పండ్లు, పసుపు, వస్త్రాలు, చలువ చేసే పదార్థాలు, మామిడి కాయలు, పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.
- నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీ నారాయణుల కటాక్షం కోసం జల దానం చేసినా, అన్న దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా నిర్జల ఏకాదశి నాడు శుభప్రదంగా భావిస్తారు.
నిర్జల ఏకాదశి రోజు తులసి పూజ
నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని విశ్వాసం. నిర్జల ఏకాదశి రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది.
చివరగా ఎవరైతే నిర్జల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అత్యంత నిష్ఠగా పూజిస్తారో వారికి సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని శాస్త్ర వచనం. అంతేకాదు భూ, కనక, వస్తు, వాహనాలు వంటివి కొన్నవారికి లక్ష్మీదేవి కటాక్షంతో కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని పండితులు చెబుతారు. ఇన్ని గొప్ప విశేషాలున్న నిర్జల ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. సకల శుభాలను పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.