Muthyapu Pandiri Vahanam Lord Venkateswara : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం సాయంత్రం మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ సందర్భంగా ముత్యపు పందిరి వాహన విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటేనే తొమ్మిది రోజులూ వాహన సేవలకే విశేష ప్రాధాన్యం ఉంది. స్వామివారు ఈ తొమ్మిది రోజులూ మలయప్పస్వామి ఉదయం, సాయంత్రం వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. కనీ విని ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తారు. ముత్యపు పందిరి వాహనంలో ముద్దులొలికే దేవేరులతో మలయప్పస్వామి భక్తకోటికి దర్శనమిస్తారు. ముత్యపు పందిరి వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత గోపాల కృష్ణుడి అవతారంలో భక్తులకు శ్రీవారు సాక్షాత్కరించారు.
అలంకార ప్రియుడు వేంకటేశ్వరుడు
దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు. అత్యంత భక్త సులభుడుగా, కోరిన వారికి కొంగుబంగారమై కోర్కెలు తీర్చే శ్రీనివాసునిగా పూజలందుకునే శ్రీవారి బ్రహ్మోత్సవాలు 'న భూతో న భవిష్యత్' అన్న తీరుగా ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. సమస్త బ్రహ్మాండానికి నాయకుడైన శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు కన్నుల పండువగా దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.
ముత్యపు పందిరి వాహన విశిష్టత
ముత్యపు పందిరి వాహన సేవను సుకుమార సేవగా కూడా పిలుస్తారు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెబుతూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతాడు. తన భక్తులందరూ కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యం వలే ప్రకాశించాలని ఆ శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తాడు. ఇదే ఈ వాహనం అంతరార్థం. ముత్యపు పందిరిపై మనోరంజకంగా భక్తకోటికి దర్శనమిచ్చే ఆ శ్రీనివాసునికి భక్తితో నమస్కరిస్తూ ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.